ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత సీట్ల భర్తీపై నిర్లక్ష్యం వద్దు : విద్యా నిర్విఘ్న ఫౌండేషన్ హెచ్చరిక

పయనించే సూర్యుడు న్యూస్ మునుగోడు మార్చి 21 విద్యా హక్కు చట్టం (RTE-2009) ప్రకారం ప్రైవేట్ అన్‌-ఎయిడెడ్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు కేటాయించిన 25 శాతం ఉచిత సీట్ల భర్తీ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని విద్యా నిర్విఘ్న ఫౌండేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఫౌండేషన్ చైర్మన్ బోల్గురి ముకేష్ మండల విద్యాశాఖాధికారి కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ బోల్గురి ముకేష్ మాట్లాడుతూ, గౌరవ సుప్రీంకోర్టు ఇటీవల (2026 INSC 56) ఇచ్చిన తీర్పును గుర్తు చేశారు. 25% ఉచిత సీట్ల భర్తీ అనేది ఒక “నేషనల్ మిషన్” అని, దీని అమలులో ఏ చిన్న నిర్లక్ష్యాన్ని కూడా సహించబోమని కోర్టు స్పష్టం చేసిందని వారు పేర్కొన్నారు. ప్రధాన డిమాండ్లు: బహిరంగ ప్రకటన: ప్రతి ప్రైవేట్ పాఠశాల తమ నోటీసు బోర్డులపై 25% కోటా కింద అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను బహిరంగపరచాలి. ఫీజుల వసూలుపై నిషేధం: ఎంపికైన విద్యార్థుల నుండి అడ్మిషన్, యూనిఫాం లేదా పుస్తకాల పేరుతో పైసా కూడా వసూలు చేయకుండా విద్యాశాఖ పర్యవేక్షించాలి. పై తరగతుల్లో ప్రవేశం: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2 నుండి 5వ తరగతి వరకు ఉన్న ఖాళీలలో కూడా వయో ప్రాతిపదికన పేద పిల్లలకు ప్రవేశం కల్పించాలి. హెల్ప్-డెస్క్ ఏర్పాటు: గ్రామాల్లోని నిరక్షరాస్యులైన తల్లిదండ్రులకు దరఖాస్తు ప్రక్రియలో సహాయం చేయడానికి మండల విద్యాశాఖ కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే, అంటే ఏప్రిల్ 30 లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసి, మండల స్థాయి కార్యాచరణ నివేదికను విడుదల చేయాలని వారు కోరారు. చట్టాన్ని అతిక్రమించే పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని, పేద విద్యార్థుల విద్యా హక్కును కాపాడాలని ఫౌండేషన్ విజ్ఞప్తి చేసింది.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఉపాధ్యక్షులు బోల్గురి రాకేష్, సభ్యులు రాజు, చరణ్య శ్రీ ఫౌండేషన్ చైర్మన్ దోమల పల్లి గోపి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *