పయనించే సూర్యుడు, మార్చి 21 2026, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష పదవిని దళిత వర్గ (ఎస్సీ) లకే ఇవ్వాలని ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు ముదిగొండ రమేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలుగా దళిత వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ పార్టీ అభ్యున్నతికి ఎంతో క్రియాశీల పాత్ర పోషించి అధికారంలోకి రావడానికి సామాన్య కార్యకర్తలుగా పటిష్టంగా పనిచేసిన నాయకులను గుర్తించి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష పదవిని ఎస్సీలకే కేటాయించాలని ఆయన కోరారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష పదవిలో ఏ దళిత వర్గ నాయకులకు నాయకత్వ పదవుల్లో గుర్తించకుండా వారికి సరైన ప్రాతినిధ్యం కల్పించకుండా కేవలం సేవకుల పాత్రకు మాత్రమే వినియోగించుకుంటూ కేవలం ఓటు బ్యాంక్ రాజకీయంగానే చూడడం ఆవేదన కలిగిస్తుందని ఆయన తెలిపారు. వెల్దండ మండల అధ్యక్ష పదవి ఎస్సీ వర్గానికి కేటాయిస్తే, అది సామాజిక న్యాయం దిశగా ఒక కీలక నిర్ణయం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూర్చడమే కాకుండా, గ్రామీణ స్థాయిలో పార్టీ పటిష్టం కావడానికి కూడా దోహదపడుతుందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి స్పందించి ఎస్సీ వర్గాల అభిప్రాయాలకు అనుగుణంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దళిత వర్గానికి ఇప్పించేలా తగిన నిర్ణయం తీసుకోవాలని ముదిగొండ రమేష్ కోరారు.