వెల్దండ మండలంలో అభివృద్ధి పనులపై అదనపు కలెక్టర్ సమీక్ష

★అదనపు కలెక్టర్- శ్యాం ప్రసాద్ లాల్

పయనించే సూర్యుడు, మార్చి 21 2026, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలంలోని గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సాగు చేస్తున్న మునగ తోటను అదనపు కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. మునగ తోట నిర్వహణ, మొక్కల పెరుగుదల, నీటి వినియోగం వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించి, రైతులకు మరింత సాంకేతిక మార్గదర్శకత అందించాలని అధికారులకు సూచించారు. అనంతరం బొల్లంపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన క్యాటిల్ షెడ్‌ను సందర్శించి పశుసంవర్థక కార్యకలాపాలకు ఇది ఉపయోగకరంగా ఉండేలా నిర్వహణపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. అలాగే నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి పనుల నాణ్యతను కాపాడుతూ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గుండాల గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన సామూహిక మరుగుదొడ్ల సముదాయమును పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడిన ఆయన ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను సమర్థవంతంగా అందరూ వినియోగించుకోవాలని సూచించారు. పనుల్లో పారదర్శకత, నాణ్యత, సమయపాలన పాటించడం అత్యంత ముఖ్యమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ, ఎంపీడీవో, ఎంపీవో, ఈసీ, టిఏలు మరియు గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఐకెపి సీసీలు, ఫీల్డ్ అసిస్టెంట్ పాల్గొన్నారు.