పయనించే సూర్యుడు / మార్చి 22 / దిడ్డి రాము / జమ్మికుంట రూరల్ ; అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరగనున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా పోస్టర్లను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అందజేయగా, హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్‌కు కూడా ప్రత్యేక ఆహ్వానం అందించారు. కార్యక్రమంలో మంత్రులకు శాలువాతో సన్మానం నిర్వహించి, దేవస్థానం తరఫున స్మారక చిహ్నాలను ఆలయ చైర్మన్ ఇంగిలే రామారావు అందజేశారు. రానున్న శ్రీరామనవమి ఉత్సవాలకు కరీంనగర్ ఇన్చార్జ్ మంత్రి సహా పలువురు ప్రముఖులు హాజరు కావాలని నిర్వాహకులు కోరారు. భక్తుల పెద్ద ఎత్తున రాకను దృష్టిలో ఉంచుకుని దేవస్థానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నారు. ఆలయ ప్రాంగణం పరిశుభ్రత, విద్యుత్ దీపాలంకరణ, తాగునీటి సదుపాయాలు, భక్తులకు క్యూలైన్ వ్యవస్థ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు. భద్రతా ఏర్పాట్లను కూడా కట్టుదిట్టం చేయాలని నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి కందుల సుధాకర్, ధర్మకర్తలు పరమేష్, నారాయణరెడ్డి, రాజేందర్, మల్లేష్, రామ్‌రెడ్డి, నగేష్ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడానికి స్థానిక ప్రజల సహకారం అవసరమని నిర్వాహకులు కోరారు.