పయనించే సూర్యుడు న్యూస్ నల్గొండ మార్చి 22. ఏదుల రిజర్వాయర్ నుండి డిండి, పాలమూరు-రంగారెడ్డి (వట్టెం) ప్రాజెక్టులకు ఎలాంటి వివక్ష లేకుండా ఒకే లెవల్‌లో నీటిని సరఫరా చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండలోని మగ్దూం భవనంలో శనివారం నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లోని ఫ్లోరైడ్, కరువు పీడిత ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి (వట్టెం) ప్రాజెక్టుకు ఏదుల రిజర్వాయర్ నుండి 440 మీటర్ల ఎత్తు నుంచే నీటిని తరలించే అవకాశం కల్పిస్తుండగా, డిండి ప్రాజెక్ట్‌కు మాత్రం 436 మీటర్ల ఎత్తు నుండి నీటిని తీసుకునేలా నిబంధనలు విధించడం నల్లగొండ జిల్లాపై జరుగుతున్న అన్యాయమన్నారు. డిండి ప్రాజెక్టు విషయంలో నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ, కొంతమంది ఇంజినీర్లు అమసరిస్తున్న ద్వంద వైఖరిపై ఆందోళన వ్యక్తం చేశారు.