చౌక ధరకే మెడిసిన్

ప్రధానమంత్రి జన ఔషధీ కేంద్రాలను వినియోగించుకోండి కరీంనగర్ ప్రజలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచన కరీంనగర్ డాక్టర్ స్ట్రీట్స్ లో ‘‘ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాన్ని’’ ప్రారంభించిన కేంద్ర మంత్రి

పయనించే సూర్యుడు మార్చి 22 కరీంనగర్ న్యూస్: రాష్ట్రంలో మెడిసిన్స్ కొనుగోలు సామాన్య ప్రజలకు భారంగా మారిన నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రధాన మంత్రి జన ఔషధి కేంద్రాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ ప్రజలంతా పీఎం జన ఔషధి కేంద్రాల్లో దొరికే చౌక మందులను వినియోగించుకోవాలని కోరారు. ఈరోజు కరీంనగర్ లోని ముకరంపుర డాక్టర్ స్ట్రీట్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ‘‘ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రం’’ను ప్రారంభించారు. పేద ప్రజలకు వైద్యం భారం కాకూడదనే ఉద్దేశంతో నరేంద్రమోదీ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకొచ్చారని చెప్పారు. దీంతోపాటు ప్రైవేట్ మెడికల్ షాపుల్లో మెడిసిన్స్ కొనుగోలు చేయాలంటే అత్యంత ఖరీదైన వ్యవహారమైందన్నారు. మెడిసిన్ కొనుగోలు చేసే స్థోమత లేక ఎంతో మంది పేదలు ఇబ్బందులు పడుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల బాధలు, ఆర్ధిక కష్టాలు తెలుసు కాబట్టే నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ‘‘ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలు’’ తెరిచి చౌక ధరకే మెడిసిన్స్ అందిస్తున్నారని తెలిపారు. ప్రధాన మంత్రి జన ఔషధి కేంద్రాలు అంటే ప్రభుత్వం తక్కువ ధరలకు నాణ్యమైన జనరిక్ మందులు అందించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక మెడికల్ స్టోర్లు అని, ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అనే పథకం కింద నిర్వహించబడుతున్నాయని తెలిపారు. బ్రాండెడ్ మందులపై ఖర్చు తగ్గించడం, గ్రామీణ ప్రాంతాల్లో కూడా చౌక ధరలకే మందుల అందుబాటులో ఉంచడం, ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తేవడంతోపాటు ప్రజలను జనరిక్ మెడిసిన్ వాడకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం ఈ జన ఔషధీ కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *