గుట్టను మింగిన గుడి ఆసాములు

★ ఆసాముల చెరలో.. వేణుగోపాల స్వామి గుట్ట★కబ్జాకోరుల కబంధ హస్తాల్లో వేణుగోపాల స్వామి గుట్ట★గుట్ట పక్కనే ఉన్న రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూమి స్వాహా★పట్టించుకోని అధికారులు.

పయనించే సూర్యుడు న్యూస్ వేములపల్లి మార్చి 23. వందల సంవత్సరాల చరిత్ర గల శ్రీ వేణుగోపాలస్వామి గుట్ట కబ్జాకోరుల పాలవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని స్థానికులు వాపోతున్నారు. వేణుగోపాలస్వామి గుట్ట కబ్జాకు గురై భావితరాలకు చరిత్ర తెలియకుండా పోతోందని స్థానికులు చర్చించుకుంటున్నారు. నార్కట్‌పల్లి-అద్దంకి హైవేను కలుపుతూ శెట్టిపాలెం నుంచి అవంతీపురం వద్ద కోదాడ-విజయవాడ రహదారిని కలుపుతూ సుమారు రూ.70 కోట్లతో మిర్యాలగూడ ఔటర్‌ బైపాస్‌ రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డు నిర్మాణానికి కాంట్రాక్టర్లు వేణుగోపాలస్వామి గుట్టను తవ్వారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే గుట్ట మట్టిని, పెద్ద గుండ్లను రోడ్డు నిర్మాణానికి వినియోగిస్తున్నారు. వేణుగోపాలస్వామి గుట్ట చుటూ ్ట ఉన్న ప్రభుత్వ భూమి మూడు సర్వే నంబర్లలో 47 ఎకరాల్లో విస్తరించి ఉంది. 31 సర్వే నంబర్‌లో 18 ఎకరాలు, 81వ సర్వే నంబర్‌లో 20 ఎకరాలు, 82వ సర్వే నంబర్‌లో 9 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అధికారులు సర్వే చేసి ప్రభుత్వ భూములను కాపాడాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. కాకతీయు కళా వైభవానికి చిహ్నంశతాబ్దాల చరిత్ర కలిగిన వేణుగోపాల స్వామి ఆలయం కాకతీయుల కళా వైభవానికి నిదర్శనంగా నిలుస్తోంది. వేణుగోపాలస్వామి ఆలయం నుంచి సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని సోమప్ప ఆలయం వరకు సొరంగం మార్గం నిర్మించారని ప్రచారంలో ఉంది. ఈ సొరంగ మార్గం నుంచి అప్పటి భక్తులు ఎడ్ల బండ్లతో సోమప్పకు చేరుకునే వారని చరిత్ర ఆనవాళ్లు చెబుతున్నాయి. వేములపల్లి మండల కేంద్రం నుంచి శెట్టిపాలెం మీదుగా అవంతీపురం వరకు ప్రభుత్వం నాలుగు లేన్ల రోడ్లు మంజూరు చేసి నిర్మాణ పనులు మొదలుపెట్టింది. ఈ రోడ్డు నిర్మాణ పనులకు కాంట్రాక్టర్‌ ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండానే వేణుగోపాలస్వామి గుట్టను తవ్వి మట్టిని రోడ్డుకు పోస్తున్నారు. మట్టి తవ్వడంతో పక్కన ఉన్న పొలం యజమానులు గుట్టను కబ్జా చేస్తున్నారు. అధికారులు స్పందించి వేణుగోపాలస్వామి గుట్టను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న రేషన్‌ డీలర్‌వేణుగోపాలస్వామి గుట్టను ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిని ఓ రేషన్‌ డీలర్‌ ఆక్రమించినా రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సదరు రేషన్‌ డీలర్‌ రెవెన్యూ కార్యాలయంలోని అధికారులకు, సిబ్బందికి పెద్ద మొత్తంలో ముడుపులు అందజేస్తున్నాడని స్థానికులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ భూములను కాపాడాలని కోరుతున్నారు. గుట్టను పరిరక్షించాలిశతాబ్దాల చరిత్ర గల వేణుగోపాలస్వామి గుట్టను తవ్వడం దారుణం. దేవాలయ గుట్టను, దీని పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను కాపాడుకోవడం అందరి బాధ్యత. ప్రభుత్వ అనుమతి లేకుండా గుట్టను తవ్వే వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలి. వేణుగోపాలస్వామి గుట్టను కాపాడాలి.