అంగన్వాడి కేంద్రం పక్కన సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలని ఆందోళన

★ జనావాసంలో సెల్ టవర్ నిర్మాణం ★ భయాందోళనలో స్థానికులు ★ అంగన్వాడి పిల్లలకు తప్పని ముప్పు ★ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా అంటున్న సిడిపిఓ. రేవతి

పయనించే సూర్యుడు ,మార్చి 24, బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం ,నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో అంగన్వాడి సెంటర్ పక్కన నూతనంగా సెల్ టవర్ నిర్మాణం చేపడుతున్నారు, గ్రామం మధ్యలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలంటూ రెడ్డిపాలెం గ్రామ సర్పంచ్ బానోతు సరోజ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు .అంగన్వాడి సెంటర్ పక్కన గ్రామం మధ్యలో గ్రామ పంచాయతీ పాలకవర్గం అంగీకారం లేకుండా సెల్ టవర్ నిర్మాణం ఎలా కొనసాగిస్తున్నారంటూ సర్పంచ్ బానోతు సరోజ ఆవేదన వ్యక్తం చేశారు, అంగన్వాడి కేంద్రానికి అతి సమీపంలో ఈ నిర్మాణం చేపట్టడం అభం, శుభం తెలియని చిన్నారుల ఆరోగ్యాన్ని క్షీణింప చేయడమే కాకుండా చుట్టు ప్రక్కల నివసిస్తున్న కుటుంబాలను రేడియేషన్ పేరిట అనారోగ్యాలతో పీడించడమే అని ఆందోళన చెందుతున్నారు. సెల్ టవర్ నిర్మాణాన్ని అడ్డుకోవాలని గర్భిణీ స్త్రీలు, అంగనవాడి పిల్లల తల్లిదండ్రులు సిడిపిఓ రేవతికి వినతి పత్రం అందజేయగా ఆమె సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడుతూ అంగన్వాడి సెంటర్ కు 100 మీటర్ల దూరంలో మాత్రమే సెల్ టవర్ నిర్మాణం జరగాలని నిబంధనలు ఉన్నాయని,అంగన్వాడి సెంటర్ పక్కన సెల్ టవర్ నిర్మాణానికి సంబంధించి కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని ఆమె తెలిపారు.