
పయనించే సూర్యుడు మార్చి 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ నకిలీల పేరుతో మోసాలు చేస్తున్నారు.. పేరున్న పత్రికల పేర్లు చెప్పి దందాలు నడిపిస్తున్నారు.. బ్లాక్మెయిల్ తో పాటు దాడులకు పాల్పడుతున్నారు.. జర్నలిజం స్థాయిని దిగజారుస్తున్న ఇలాంటి వ్యక్తులపై నడుంబిగించాల్సిన అవసరం ఉంది.. కలిసికట్టుగా పోరాడుదాం.. ఇలాంటి నకిలీ గాళ్ళ గుట్టును రట్టు చేద్దాం.. అని సీనియర్ జర్నలిస్టులు లట్టుపల్లి మోహన్ రెడ్డి, ఎండి ఖాజాపాషా (కెపి) పిలుపునిచ్చారు. షాద్ నగర్ పట్టణంలోని దేవి గ్రాండ్ లో సోమవారం టిడబ్ల్యూజేఎఫ్ సమావేశాన్ని డివిజన్ అధ్యక్షుడు జే. రాఘవేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ లట్టుపల్లి మోహన్ రెడ్డి జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడుతూ.. నకిలీ జర్నలిస్టుల కారణంగా జర్నలిస్టులం అని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. మూడు దశాబ్దాల పైగా జర్నలిజంలో విలువలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగామని, ఇలాంటి విలువలు లేని వ్యక్తుల వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి.. జర్నలిజాన్ని కేవలం సేవల కోసం మాత్రమే ఉపయోగించాలని సూచించారు. జర్నలిజంను పార్ట్ టైం గా చేసుకొని ప్రతి ఒక్కరు ఏదో ఒక వృత్తి ద్వారా సంపాదించుకోవాలని అన్నారు. అదేవిధంగా జర్నలిజంపై తగిన శిక్షణ పొంది జర్నలిజం స్థాయిని పెంచాలని సూచించారు. వార్తలు రాసే వారే జర్నలిస్టులని, బ్లాక్మెయిల్ చేసేవారు నకిలీ జర్నలిస్టులని ఆయన వెల్లడించారు. నూటికి నూరు శాతం అంకిత భావంతో పని చేసినప్పుడే జర్నలిస్టుగా గుర్తింపు పొందుతామని వెల్లడించారు. సభ్యులు కోరినట్లు ఏప్రిల్ మొదటి లేదా రెండో వారంలో జర్నలిస్టులకు తరగతులు నిర్వహించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. జర్నలిస్టులు అని దాడులు చేస్తారా.. జర్నలిస్ట్ కేపి జర్నలిస్టులు అంటే సంఘటన స్థలానికి వెళ్లాలి.. ఫోటోలు, వీడియోలు తీయాలి.. వార్తలు రాయాలి.. అంతేతప్ప అవతలి వ్యక్తుల మీద దాడి చేసే హక్కు ఎవరిచ్చారు.. ఇలా దాడులకు పాల్పడే వారిని జర్నలిస్టులు అంటారా.. అని జర్నలిస్ట్ కేపీ విరుచుకుపడ్డారు. ఫరూక్ నగర్ మండలం విఠ్యాల గ్రామంలో కొందరు జర్నలిస్టుల పేరు మీద ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరు అసలు జర్నలిస్టులో.. ఎవరు నకిలీ జర్నలిస్టులో.. అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. నకిలీల కారణంగా అసలైన జర్నలిస్టులు బదనాం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల రిపోర్టర్లు అంటేనే తరిమికొట్టే పరిస్థితి ఏర్పడుతుందని వాపోయారు. షేక్ జర్నలిస్టుల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. జర్నలిస్టులు కనీస డిగ్రీలతో తమను తాను తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. గతంలో ఎల్బీనగర్ విలేకరుల వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చినందుకు స్థానిక విలేకరిపై దాడికి ప్రయత్నించారని గుర్తు చేశారు. ఇలాంటి వాటిని నిరోధించేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని, పోలీసులను, అధికారులను కలిసి వినతి పత్రాలు అందించాలని సూచించారు. డబ్బులకు అలవాటు పడి విలువలను చంపుకునే సంస్కృతికి ప్రతి ఒక్కరూ స్వస్తి చెప్పాలని సూచించారు. ఏ సమస్య ఉన్న జర్నలిస్టులందరికీ తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. శిక్షణ ఇవ్వండి.. జర్నలిస్టులకు సరైన శిక్షణ ఇవ్వడం ద్వారా వారిని సరైన మార్గంలో నడిపే ప్రయత్నం చేయాలని అధ్యక్ష కార్యదర్శి రాఘవేందర్ గౌడ్, నరేష్, సీనియర్ జర్నలిస్ట్ రంగనాథ్, సంజీవ్ కుమార్, బాల రాజేష్, లక్ష్మణ్, రమణ, ఖాజా సోహెల్, సాయినాథ్ రెడ్డి, షకీల్, రాము, జిల్లా నాయకులు నర్సింహ రెడ్డి, ఖాజా సోహెల్, పలువురు జర్నలిస్టులు సమావేశంలో అభిప్రాయపడ్డారు. జర్నలిస్టుల జాబితా ఒకటి తయారు చేసి అధికారులకు, పోలీసులకు ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ బ్లాక్మెయిల్ కార్యకలాపాలకు పాల్పడుతున్న జర్నలిస్టుల ఆట కట్టించాలని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. జర్నలిస్టులో ఐక్యత లేకపోవడం వల్ల కూడా వేరే వాళ్ళు, నకిలీలు రంగ ప్రవేశం చేస్తున్నారని మరికొందరు పేర్కొన్నారు. ప్రెస్ కార్డులు ఇవ్వడం ద్వారా అసలైన జర్నలిస్టులకు న్యాయం చేయాలని మరికొందరు కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రాఘవేందర్, ప్రధాన కార్యదర్శి నరేష్ జిల్లా ప్రచార కార్యదర్శి నరసింహ రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు కస్తూరి రంగనాథ్, టి. సంజీవ్ కుమార్, సరాపు రమేష్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి సాయినాథ్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు రాకే ష్ , ఖాజా సోహెల్, చందర్ రాజు, భాస్కర్, నరేందర్, సురేందర్, ధరoపాల్, షకీల్, ఆనంద్, అజీమ్, శేఖర్, రాజు, రియాజ్, అశోక, ఆవుల రమేష్ , దర్శనం శంకర్, జగన్, మురళీ తదితరులు పాల్గొన్నారు..