పందలపాకలో వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తపై దాడి

నియోజకవర్గంలో మిన్నంటిన రాజకీయ వేడి

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 24 అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ సురేష్ అనపర్తి నియోజకవర్గంలో రాజకీయ దాడులు కలకలం రేపుతున్నాయి. బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తపై జరిగిన దాడితో స్థానికంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. సోషల్ మీడియా వేదికగా పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నాడనే కక్షతోనే ఈ దాడికి పాల్పడినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. అరాచక రాజకీయాలు నశించాలి – వైఎస్సార్‌సీపీ ఆగ్రహం: ఈ ఘటనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నాయకులు బాధితుడిని పరామర్శించి అండగా నిలిచారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను గౌరవించాల్సింది పోయి, ఇలా భౌతిక దాడులకు పాల్పడటం హేయమైన చర్య అని వారు మండిపడ్డారు. అధికార మదంతో ప్రతిపక్ష కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయాలని చూడటం అప్రజాస్వామికమని నాయకులు ధ్వజమెత్తారు. పోలీసుల విచారణ – తక్షణ చర్యలకు డిమాండ్: దాడికి పాల్పడిన నిందితులను వెంటనే గుర్తించి, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. నియోజకవర్గంలో శాంతిభద్రతలను కాపాడాలని పోలీసు యంత్రాన్ని కోరాయి. రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఆపకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. బాధితుడు ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *