పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 24 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, మార్చి 23: మండలంలో జరుగుతున్న పదవ తరగతి వార్షిక పరీక్షలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ టి. యయాతి రాజు సోమవారం మండలంలోని పలు పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి పర్యవేక్షించారు. పరీక్షా కేంద్రాలకు చేరుకున్న అధికారులు ముందుగా భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. కేంద్రాల వద్ద విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి సూచనలు ఇస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కేంద్రాల పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల సంచారం ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. అనంతరం అధికారులు పరీక్షా గదులను పరిశీలించి, విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాస్తున్నారా అనే విషయాన్ని గమనించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కేంద్ర సూపరింటెండెంట్లకు సూచించారు. ముఖ్యంగా నకలు నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టంగా ఆదేశించారు. ఈ సందర్భంగా సీఐ నాగరాజు మాట్లాడుతూ, పదవ తరగతి పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమైన మలుపు. అందువల్ల పరీక్షలు పూర్తిగా పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరగాలని పోలీసు శాఖ కట్టుబడి ఉంది. ఎలాంటి అవకతవకలు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు. ఎస్‌హెచ్‌ఓ టి. యయాతి రాజు మాట్లాడుతూ, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో, అనవసరంగా గుంపులు గూడకుండా తల్లిదండ్రులు, ప్రజలు సహకరించాలని కోరారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, అంబులెన్స్ వంటి అత్యవసర సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. అలాగే పరీక్షా సమయాల్లో శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు కేంద్రాల పరిసరాల్లో లౌడ్‌స్పీకర్ల వినియోగంపై కూడా పరిమితులు విధించినట్లు తెలిపారు. మండలంలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతోందని, పరీక్షల నిర్వహణలో పారదర్శకతకు ఇది దోహదపడుతోందని అధికారులు పేర్కొన్నారు. పరీక్షల ముగింపు వరకు ఇదే విధంగా కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. ఈ తనిఖీలలో పోలీసు సిబ్బంది, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.