పది పరీక్షలు ముగిసే వరకు వసతులు కల్పించాలి : కలెక్టర్ చంద్ర‌శేఖ‌ర్‌.

పయనించే సూర్యుడు న్యూస్ నల్గొండ మార్చి 24 పదో తరగతి పరీక్షలు ముగిసే వరకు కేంద్రాలలో వసతుల కల్పనలో ఎలాంటి లోపం ఉండకూడదని న‌ల్ల‌గొండ‌ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. సోమవారం నల్ల‌గొండ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల ఆవరణలో గ‌ల పరీక్ష కేంద్రాలను ఆయ‌న‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాలలో అన్ని వసతులు ఎప్పటిలాగే ఉండాలని, ప్రత్యేకించి తాగునీరు, శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ప‌టిష్ట భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. పూర్తి స్థాయిలో తనిఖీ తర్వాతే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమ‌తించాల‌న్నారు. ఈ సందర్బంగా విద్యార్థుల హాజరు, తదితర వివరాలను క‌లెక్ట‌ర్ అడిగి తెలుసుకున్నారు. పరీక్ష కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్స విభాగంలో ఏఎన్ఎంతో మాట్లాడి వైద్య వ‌స‌త‌లు క‌ల్ప‌న‌పై ఆరా తీశారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు.