బడ్జెట్‌లో బీసీలకు ‘మొండిచేయి’.. ఈసీఐఎల్ చౌరస్తాలో భారీ ధర్నా

* కామారెడ్డి డిక్లరేషన్ హామీలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ సర్కార్ * ఏడాదికి రూ. 20,000 కోట్లు ఏమయ్యాయంటూ సుదగాని హరి శంకర్ గౌడ్ ప్రశ్న * 42 శాతం రిజర్వేషన్ల కోసం పనగట్ల చక్రపాణి గౌడ్, సింగం అరుణ్ పటేల్ డిమాండ్

పయనించే సూర్యడు / మార్చ్ 24/ ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ అంకెల గారడీ తప్ప సామాన్య ప్రజలకు, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాలకు పైసా ప్రయోజనం లేని ‘అప్పుల బడ్జెట్’ అని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టి ఆర్ పి) మేడ్చల్ జిల్లా నాయకులు ధ్వజమెత్తారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న పిలుపు మేరకు సోమవారం కాప్రా సర్కిల్ పరిధిలోని ఈసీఐఎల్ చౌరస్తాలో జిల్లా పార్టీ అధ్యక్షులు పనగట్ల చక్రపాణి గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీ ధర్నా నిర్వహించాయి. ప్లకార్డులు చేతబూని, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో చౌరస్తాను హోరెత్తించారు. బీసీలను వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుదగాని హరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బీసీలకు ఇచ్చిన ‘కామారెడ్డి డిక్లరేషన్’ హామీలను బడ్జెట్‌లో పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో బీసీ సంక్షేమానికి ఏడాదికి రూ. 20,000 కోట్లు కేటాయిస్తామని గొప్పలు చెప్పిన పాలకులు, నేడు బడ్జెట్‌లో ఆ ఊసే ఎత్తకపోవడం బీసీలను దారుణంగా వంచించడమే అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పిస్తామన్న హామీపై ప్రభుత్వం మౌనం వహించడం వెనుక అంతర్యమేమిటని ప్రశ్నించారు. 42 శాతం రిజర్వేషన్లే మా లక్ష్యం జిల్లా పార్టీ అధ్యక్షులు పనగట్ల చక్రపాణి గౌడ్ మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తక్షణమే 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళలకు నెలకు రూ. 2,500 ఇచ్చే మహాలక్ష్మి పథకానికి, నిరుద్యోగ భృతికి తగిన నిధులు కేటాయించకపోవడం మోసపూరితమన్నారు. ఈ బడ్జెట్ బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని విమర్శించారు. ఉద్యమం ఉధృతం చేస్తాం ప్రభుత్వం ఇప్పటికైనా తన మొండి వైఖరిని వీడి, సవరించిన బడ్జెట్‌లో బీసీలకు న్యాయం చేయాలని జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు సింగం అరుణ్ పటేల్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ బడ్జెట్ కేవలం అప్పుల కుప్పగా మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుదగాని హరిశంకర్ గౌడ్, జిల్లా పార్టీ అధ్యక్షులు పనగట్ల చక్రపాణి గౌడ్, జిల్లా యువత అధ్యక్షులు సింగం అరుణ్ పటేల్, మహిళా అధ్యక్షురాలు నీరుడు షాలిని, బయ్యా వెంకటేష్, ప్రవీణ్ కుమార్, అంబాల శ్రీనివాస్, అభిరామ్, కమలాకర్, మహేష్ గౌడ్, మచ్చ పాండు గౌడ్, దుర్గ ప్రసాద్, సుల్తాన, మహేందర్ యాదవ్, జి కృష్ణ కుమార్, బాసీద్, అనిల్, మారుతి శ్రీనివాస్, మురళి, బన్నాపురం నాగరాజు, నర్సింగ్ రావు, కాసుల నందం గౌడ్, అనూప్, శ్రీనాద్, జిల్లా పార్టీ నాయకులు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *