పయనించే సూర్యుడు-24-03-2026-రాజంపేట న్యూస్ : భగత్ సింగ్ స్ఫూర్తితో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుదామని పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు నేతి నాగేశ్వర పిలుపునిచ్చారు. జాతీయ ఉద్యమ నాయకులు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ల 95వ వర్ధంతి సభ రాజంపేట పట్టణంలోని గీతాంజలి డిగ్రీ కళాశాలలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ( పి డి ఎస్ యు) ఆధ్వర్యంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతి నాగేశ్వర మాట్లాడుతూ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశ ప్రజల స్వేచ్ఛ, స్వతంత్రం కోసం ఎంతోమంది విద్యార్థులు, యువకులు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారన్నారు. వారిలో అగ్ర గన్యులు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ లు అని కొనియాడారు. సామ్రాజ్యవాదుల ఆదిపత్యం పీకి పారేయాలి అంటే భారతదేశంలో ఒకే ఒక ఆయుధం అది శ్రామిక వర్గ విప్లవమని భగత్ సింగ్ వందేళ్ళ క్రితమే చెప్పారని తెలిపారు. 1931 మార్చి 23న బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వీరు ముగ్గురుని క్రూరంగా ఉరి తీశారన్నారు. మాతృదేశ విముక్తి కోసం ఎన్నిసార్లు అయినా ఉరితాళ్లను పూలమాలుగా స్వీకరిస్తానని కామ్రేడ్ భగత్ సింగ్ ధైర్యంగా ప్రకటించాడని తెలిపారు. గీతాంజలి విద్యాసంస్థల అధినేత ఎస్వి రమణ మరియు కళాశాల ప్రిన్సిపాల్ సంబావు చలపతి మాట్లాడుతూ భగత్ సింగ్ 23 సంవత్సరాల వయస్సులోనే ప్రపంచాన్ని కదిలించాడని, “దేశం కోసం జీవించాలి, అవసరమైతే మరణించాలి” అన్న నినాదంతో ముందుకెళ్ళాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ యూ జిల్లా నాయకులు నితిన్ కుమార్, దీపిక, అన్నపూర్ణ, పుష్పాంజలి, వర్షిత, సాగర్, చైతన్య, శివ, పృథ్వి, హేమంత్, సాయి మరియు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.