రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి.

★ బోధన్ ఏఎంసీ చైర్మన్ చీల శంకర్.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 24 సాలూర : రైతులు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ చీల శంకర్,వైస్ చైర్మన్ వసంత్ రెడ్డి అన్నారు.మార్క్ ఫెడ్,ఎన్సీసీఎఫ్ నేతృత్వంలో సాలూర సొసైటీల ఆధ్వర్యంలో సోమవారం శనగ మరియు పొద్దుతిరుగుడు (సన్ ఫ్లవర్) కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.రూ 5875 శనగ మద్దతు ధర,పొద్దు తిరుగుడు మద్దతు ధర రూ 7721 గా నిర్ణయించినట్లు వెల్లడించారు.రైతులు ఓపికగా ఉంటూ సిబ్బందికి సహకరిస్తూ పంటను విక్రయించాలని సూచించారు.రైతుల ఆర్థిక అభివృద్ధి కొరకు మంచి గిట్టుబాటు ధరను ఇస్తూ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు నాయకులు పేర్కొన్నారు.ఈ అవకాశాన్ని ప్రతి రైతు ఉపయోగించుకోవాలని కోరారు.దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు.ఎకరాకు 7 క్వింటాళ్ల 62 కిలోల పంటను కొనుగోలు చేయడానికి నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ కంటాలలో 10 క్వింటాళ్ల వరకు తీసుకోవాలి. శనగ పంట ఈ సీజన్ లో దిగుబడి ఎక్కువగా వచ్చినందున రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో ఎకరాకు 7 క్వింటాళ్ల 62 కిలోలు కొనుగోలు చేయడం వలన రైతులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో ఎకరాకి 10 క్వింటాళ్ల పంటను తీసుకోవాలని రైతులు విన్నవించారు.ప్రభుత్వం మరియు అధికార యంత్రాంగం దీనిపై తక్షణమే ఒక నిర్ణయానికి వచ్చి శనగ పంట కొనుగోలులో మార్పులు చేర్పులు చేసి రైతులకు సహకరించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.లేదంటే పండించిన శనగ పంట దిగుబడి ఎక్కువగా వచ్చినప్పటికీ నష్టపోయే అవకాశాలు ఉంటాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, సొసైటీ ప్రత్యేక అధికారి శ్రీనివాస్,ఏవో శ్వేత,పలు గ్రామాల సర్పంచ్ లు పార్టీ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.