శ్రీరాం నగర్ 2బిహెచ్‌కే సమస్యలు పరిష్కరించాలి

ప్రజావాణిలో కలెక్టర్‌కు లబ్ధిదారుల వినతి

పయనించే సూర్యడు / మార్చ్ 24/ ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు కప్రా సర్కిల్ పరిధిలోని శ్రీరాం నగర్ 2బిహెచ్‌కే కాలనీలో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలు పరిష్కరించాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. సోమవారం మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ మను చౌదరికి వినతి పత్రం అందజేసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు రాములు నాయక్, రవీందర్, గౌస్, షఫీ మాట్లాడుతూ.. కాలనీలోని వాణిజ్య సముదాయాలను వేలం వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. వాటిని కిరాయికి ఇస్తే వచ్చే ఆదాయం ద్వారా మెయింటెనెన్స్ ఖర్చుల భారం కొంతవరకు తగ్గుతుందని సూచించారు. కాలనీలో కనీస సౌకర్యాల లేమితో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. జీరో కరెంట్ బిల్లు అమలు చేయాలని, బస్తీ దవాఖాన ఏర్పాటు చేయాలని, 117 నంబర్ బస్సును శ్రీరాం నగర్ 2బిహెచ్‌కే వరకు పొడిగించాలని డిమాండ్ చేశారు. భవనాల స్లాబులు ఊడి పెచ్చులు రాలుతున్నాయని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు. నీటి లీకేజీలను అరికట్టాలని తెలిపారు. లిఫ్ట్‌ల ఏఎంసీలను పొడిగించి, పనిలో లేని లిఫ్ట్‌లను తక్షణమే మరమ్మతులు చేయాలని, డబుల్ బెడ్‌రూమ్ కాలనీ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ల వద్ద సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేయడంతో పాటు వీధి దీపాలకు కేబుల్స్ వేయాలని కోరారు. సెల్లార్‌లో నీటి నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లబ్ధిదారుల సమస్యలపై కలెక్టర్ మను చౌదరి వెంటనే స్పందించి, సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో 2బిహెచ్‌కే లబ్ధిదారులు బాబురావు, కిషన్, సతీష్, సైదులు, యాదగిరి, రాజిరెడ్డి, ఇస్మాయిల్, మున్నా తదితరులు పాల్గొన్నారు.