సంఘంలోని నిధులు ఏమయ్యాయి..20 సంవత్సరాలుగా వివరాలు తెలియ పరచడం లేదు.. సంఘ కౌన్సిల్ సభ్యురాలు ఆశ ఆరోపణ..

పయనించే సూర్యుడు మార్చి 24, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) వాకలపూడి గ్రామంలో గల ప్రముఖ మూడవ ఏపీఎస్పీ యూనియన్ చర్చ్ క్రైస్తవ సంఘంలో భారీ స్థాయిలో ఆర్థిక అక్రమాలు జరుగుతున్నాయని ఆ సంఘం కౌన్సిల్ సభ్యురాలు సంచలన ఆరోపణలు చేశారు. గత 20 ఏళ్లుగా సంఘం నిధులకు సంబంధించిన ఎలాంటి లెక్కలు చూపడం లేదని, ప్రశ్నిస్తే మహిళ అని కూడా చూడకుండా వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీఎస్పీ చర్చి లో జరుగుతున్న ఆర్థిక లావాదేవీలు, సక్రమంగా లేవని సదరు చర్చి కౌన్సిల్ సభ్యురాలు అయిన రెడ్డి ఆశా జ్యోతి మీడియా వద్ద పలు ఆరోపణలు చేశారు.రిటైర్డ్ ఉద్యోగులు, టీచర్లు కలిసి ఏర్పాటు చేసుకున్న ఈ సంఘంలో గత రెండు దశాబ్దాలుగా ఒకే వర్గం ఆధిపత్యం కొనసాగుతోంది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆదాయ, వ్యయాల వివరాలను బహిర్గతం చేయలేదని ఆవేదన చెందారు.చర్చి ఆధునీకరణ పేరుతో కోట్లాది రూపాయల నిధులను వాడుతున్నారని, ఎలివేషన్ మరియు స్లాబ్ పనులకే సుమారు 1.20 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నట్లు చూపిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించిన కొటేషన్లు, ఎస్టిమేషన్ కాపీలు అడిగితే ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని తెలిపారు. సంఘం పేరు మీద ఉన్న బ్యాంక్ ఖాతాల జిరాక్స్ కాపీలు, గత 20 ఏళ్ల స్టేట్‌మెంట్లను కౌన్సిల్ సభ్యురాలిగా అడిగే హక్కు ఉన్నప్పటికీ, నిర్వాహకులు వాటిని తొక్కిపెడుతున్నారని విమర్శించారు. లెక్కలు అడిగినందుకు తనను వ్యక్తిగతంగా దూషించడమే కాకుండా, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా ఐ.ఎస్.పి. కుమార్ అనే వ్యక్తి తన మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని, కౌన్సిల్‌లో చదువుకోని వారు, అవగాహన లేని వారు ఉండటం వల్ల ఈ అక్రమాలకు అడ్డులేకుండా పోయిందని ఆమె వాపోయారు. సుమారు 17 కోట్ల రూపాయల వరకు నిధుల దుర్వినియోగం జరిగి ఉంటుందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం ఒక విచారణ కమిటీని వేయాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె మీడియా సాక్షిగా అధికారులను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *