నాకు ఇచ్చే మంత్రి పదవి కాంగ్రెస్ పార్టీకే మంచి పేరు తెస్తుంది : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి .

*అధికార, ప్రతిపక్ష నేతలు ఒకే చోట చేరి సుదీర్ఘంగా చర్చలు. *అసెంబ్లీ డైనింగ్ హాల్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ . * దాదాపు రెండు గంటల పాటు ఏకాంతంగా చర్చలు జరిపిన కేటీఆర్ , రాజగోపాల్ రెడ్డి . *ఇది కేవలం మర్యాదపూర్వక భేటీనా? లేక భవిష్యత్ రాజకీయ మార్పులకు సంకేతమా ? *రాజగోపాల్ రెడ్డి 'అసంతృప్తి' నేపథ్యంలో ప్రాధాన్యత .

పయనించే సూర్యుడి న్యూస్ మునుగోడు మార్చి 25. తెలంగాణ అసెంబ్లీలో మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కలిసి లంచ్ చేస్తూ, దాదాపు రెండు గంటల పాటు ఏకాంతంగా చర్చలు జరపడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఈ భేటీ గంభీరమైన అంశాలపై జరిగినట్లు తెలుస్తోంది.   గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో ఆసక్తికరమైన ‘చిట్ చాట్’ నిర్వహించారు. తన మంత్రి పదవి, ముఖ్యమంత్రితో భేటీ, మరియు కేటీఆర్‌తో జరిపిన చర్చలపై ఆయన కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. మంత్రి పదవి విషయంలో గతంలో అధిష్టానం తనకు హామీ ఇచ్చిందని రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు. “అధిష్టానం ఇప్పుడు ఏం చేస్తుందో నాకు తెలియదు, కానీ నేను పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదు. ఏ పదవి లేకపోయినా ప్రజల్లో నాకు తగిన గౌరవం ఉంది,” అని ఆయన స్పష్టం చేశారు. అయితే, తనకు మంత్రి పదవి ఇస్తే అది వ్యక్తిగతంగా తనకంటే కాంగ్రెస్ పార్టీకి మరియు రాష్ట్ర ప్రభుత్వానికే మంచి పేరు తెస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమకారుల అవసరం ఉంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే తనలాంటి తెలంగాణ ఉద్యమకారుల సేవలు పార్టీకి చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. కేడర్‌లో పట్టున్న నేతలను గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పరోక్షంగా గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. నిన్న ముఖ్యమంత్రితో ప్రత్యేక భేటీ ఏదీ జరగలేదని, అసెంబ్లీలో ఎదురుపడినప్పుడు కేవలం మర్యాద పూర్వకంగా పలకరించుకున్నామని తెలిపారు. ఇవాళ అసెంబ్లీ డైనింగ్ హాల్‌లో కేటీఆర్‌తో జరిపిన సుదీర్ఘ భేటీపై స్పందిస్తూ.. అది కేవలం సాధారణ సంభాషణ మాత్రమేనని చెప్పారు. అయితే, ఆ చర్చల్లో గత రాజకీయ పరిణామాలను ప్రస్తావించినట్లు ఆయన వెల్లడించారు. “2018 ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 88 సీట్లు వచ్చినప్పటికీ, 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం మీరు చేసిన అతిపెద్ద తప్పు అని కేటీఆర్‌‌కు చెప్పాను,” అని రాజగోపాల్ రెడ్డి వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *