పయనించే సూర్యుడు మార్చి, 25 మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్ బాలానగర్ మండలం పరిధిలోని నేరళ్ళపల్లి గ్రామ పంచాయతీకి మంజూరైన మహిళా సమైక్య భవన నిర్మాణ స్థలం విషయమై గ్రామంలో వివాదం నెలకొంది. ఈ భవనాన్ని గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్మించాలని గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు తీర్మానం చేశారు. అయితే, ఈ నిర్ణయాన్ని గ్రామ ప్రజలు, యువకులు వ్యతిరేకిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో భవన నిర్మాణం చేపట్టడం సరికాదని, భక్తుల సౌకర్యార్థం ఆ స్థలాన్ని వదిలేసి, వేరే ఇతర ప్రభుత్వ స్థలంలో ఈ భవనాన్ని నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ మేరకు మంగళవారం నేరళ్ళపల్లి గ్రామ పెద్దలు, యువకులు కలిసి బాలానగర్ ఎంపీడీవో గారికి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆలయ పవిత్రతను కాపాడాలని, ప్రజల అభిప్రాయాలను గౌరవించి భవన నిర్మాణ స్థలాన్ని మార్చాలని అధికారులను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు మరియు మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.