పయనించే సూర్యుడు-26-03-2026-రాజంపేట న్యూస్ : రైల్వే అండర్ బ్రిడ్జి సమస్యను పరిష్కరిస్తానని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చమర్తి జగన్మోహన్ రాజు హామీ ఇచ్చారు. మార్నింగ్ వాక్ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన ఎంపీడీఓ వరప్రసాద్, మునిసిపల్ సిబ్బంది మరియు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి రైల్వే అండర్ బ్రిడ్జిని సందర్శించారు. అండర్ బ్రిడ్జి నిర్మాణం కొరకు అక్కడ తొలగించవలసిన భవనాల యజమానులతో చర్చించి వారికి కూడా ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తానని భరోసా కల్పించారు. అక్కడ ఉన్నటువంటి వ్యాపారుల కోరిక మేరకు మునిసిపాలిటీ స్థలంలో లీజు ప్రాతిపదికన వారు దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వంతో మాట్లాడి ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులు వచ్చేలా చూస్తానని తెలియజేశారు. అలాగే బ్రిడ్జి నిర్మాణం కొరకు కోల్పోయిన స్థలాలకు నష్టపరిహారం చెల్లిస్తే సరిపోతుందని అక్కడి వ్యాపారులు తెలపడంతో ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఎంతో కాలంగా విద్యార్థులు, వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారానికి పునాది పడినట్లు అయిందని పుర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ అధికారులు మరియు టిడిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.