ఉద్యోగ కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యం.

* పలాస జాబ్ మేళాలో ఎమ్మెల్యే గౌతు శిరీష పిలుపు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 26 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. యువత తమ నైపుణ్యాలకు పదును పెట్టి, పట్టుదలతో కృషి చేస్తే ఉజ్వల భవిష్యత్తు వారిదేనని, వారి విజయం కేవలం వారి కుటుంబానికే కాక యావత్ పలాస నియోజకవర్గానికి గర్వకారణమని పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పలాస మున్సిపాలిటీ పరిధిలోని విద్యావాహిని డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై యువతను ఉద్దేశించి స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానస పుత్రికే ఈ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం అని, యువతలోని ప్రతిభను గుర్తించి శిక్షణ ఇస్తే వారు సమాజానికి ఆస్తిగా మారతారని ఆయన బలంగా విశ్వసిస్తారని శిరీష పేర్కొన్నారు. రానున్న రోజుల్లో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, కేవలం 21 నెలల్లోనే డీఎస్సీ, కానిస్టేబుల్ నియామకాల వంటి ఎన్నో ఉద్యోగాలను ఇప్పటికే భర్తీ చేసామని గుర్తుచేశారు. యువతకు ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న దూరదృష్టితోనే నారా లోకేష్ ఐటీ, విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారని వివరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. “నేను కూడా మీలాగే పీజీ పూర్తి చేసి, గ్రూప్ 1 లో ఇంటర్వ్యూ వరకు వెళ్లి కొన్ని కారణాల వల్ల హాజరు కాలేకపోయాను. నా కెరీర్ ముగిసిపోయిందనుకున్నా. కానీ, నాలో ఉన్న నైపుణ్యం వృధా పోలేదు, నలభై ఏళ్ల తర్వాత ప్రజాసేవ చేసే ఈ అవకాశం నన్ను వరించింది. కాబట్టి, వైఫల్యాలకు నిరాశ చెందవద్దు, ఎందుకంటే విజయానికి మొదటి మెట్టు అపజయమే,” అని ఆమె హితవు పలికారు. వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవద్దని, మొదటి అడుగుతోనే వంద మెట్ల గమ్యాన్ని చేరుకోగలమని సూచించారు. పదవికి గొప్పదనం నేను ఎన్ని అధికారాలు అనుభవించానో అన్నది కాదు, నా నియోజకవర్గం నుండి ఎంతమంది యువత ఉన్నత శిఖరాలకు చేరుకున్నారన్నదే నాకు నిజమైన గర్వకారణం,” అని ఆమె అన్నారు. యువత తాము ఎంచుకున్న రంగంలో ఇష్టంతో పనిచేసి, తల్లిదండ్రులతో పాటు పలాస ప్రాంతం గర్వపడే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ జాబ్ మేళాకు యువత నుండి విశేష స్పందన లభించింది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకు వచ్చిన విద్యావాహిని కళాశాల యాజమాన్యాన్ని, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారిని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అధికారులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *