పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 26 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని కావడిగుండ్ల గ్రామ పంచాయతీ పరిధిలో బుధవారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామ సమస్యలపై రెవెన్యూ అధికారులు నిర్వహిస్తున్న విచారణలో జోక్యం చేసుకున్న పొరుగు రాష్ట్రానికి చెందిన గిరిజనేతర వ్యక్తులు, స్థానిక సర్పంచ్ బాడిశ లక్ష్మణరావు, గ్రామస్తులపై విచక్షణారహితంగా దాడికి దిగటమే కాకుండా కులం పేరుతో దూషించారని సమాచారం. వివరాల్లోకి వెళ్తే కావడిగుండ్ల గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం ఉదయం 11:30 గంటలకు రెవెన్యూ అధికారులు మరియు గ్రామ కార్యదర్శి ఒక పిర్యాదుకు సంబంధించి విచారణ చేపడుతున్నారు. ఈ సమయంలో సర్పంచ్ బాడిశ లక్ష్మణరావు, గ్రామ పెద్దలు మాజీ ఎంపీటీసీ వాసం బుచ్చిరాజు, కణితి జగ్గయ్య తదితరులు అధికారులకు సహకరిస్తున్నారు. అయితే, ఈ విచారణతో ఎటువంటి సంబంధం లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బుట్టాయిగూడెంకు చెందిన గుబ్బల సత్యంబాబు అనే గిరిజనేతర వ్యక్తి మధ్యలోకి వచ్చి అధికారులను, సర్పంచ్‌ను అడ్డుకున్నాడని, కులం పేరుతో దూషించారని ఆరోపిస్తున్నారు. స్థానికేతరుడివైన నీకు ఇక్కడ ఏం పని? అని సర్పంచ్ ప్రశ్నించగా, గుబ్బల సత్యంబాబు ఆగ్రహంతో ఊగిపోయాడు. అధికారుల ముందే సర్పంచ్‌ను కుర్చీతో కొట్టి క్రింద పడేశాడు. అంతే కాకుండా గ్రామ పెద్ద కణితి జగ్గయ్యను చెప్పుతో కొట్టి అవమానించాడు. ఆంధ్ర గిరిజనేతరుడు గుబ్బల సత్యంబాబుకు మద్దతుగా కావడి గుండ్ల గిరిజనేతరుడు తుమ్మూరి ప్రసాద్, జాడి బాబురావు, బషీర్ మరియు కావడి గుండ్ల గ్రామానికి చెందిన కుంజా బుచ్చిరాజు, గోవింద్‌లు కలిసి గ్రామస్తులపై దాడి చేశారు. ఈ క్రమంలో పంచాయతీ కార్మికుడు మడకం రాజుల తలపై కర్రతో కొట్టడంతో తీవ్ర రక్తస్రావమైంది. ఏజెన్సీ చట్టాలను 1/70 ఉల్లంఘిస్తూ, ఇతర రాష్ట్రాల గిరిజనేతర వ్యక్తులు వచ్చి స్థానిక గిరిజన ప్రతినిధులపై దాడి చేయడంపై గ్రామంలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. బాధితులు వెంటనే అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎస్‌ఐకి రాతపూర్వక ఫిర్యాదు అందజేశారు. దాడికి పాల్పడి కులం పేరుతో దూషించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.