
పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 26 రిపోర్టర్ అభి కోసిగి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్-2 నియామకాల ద్వారా ఎంపికైన ట్రైనీ ప్రొహిబిషన్, ఎక్సైజ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఎస్. ధనుంజయ బుధవారం కోసిగి ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్‌లో బాధ్యతలు స్వీకరించి శిక్షణను ప్రారంభించారు. పెద్దకడబూరు గ్రామానికి చెందిన ధనుంజయ, ప్రభుత్వ సేవలో చేరడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తానని తెలిపారు. శాఖలోని విధులు, చట్టాలు, అమలు విధానాలపై పూర్తి అవగాహన సాధించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ పి. భార్గవ రెడ్డి ఆయనను అభినందించి, శిక్షణ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శాఖలో క్రమశిక్షణ, నిష్పక్షపాతంగా విధులు నిర్వహించడం ఎంతో ముఖ్యమని, ఉన్నతాధికారుల సూచనలు పాటిస్తూ అనుభవాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. స్టేషన్ సిబ్బంది కూడా ధనుంజయకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన సేవలు శాఖకు ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.