జహీరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు: సామాన్యుడి జేబుకు చిల్లు బంకుల వద్ద క్యూలు

పయనించే సూర్యుడు మార్చ్ 26 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ప్రతినిధి స్వాతి.నర్సిములు ) "దేశంలో ఇంధన కొరత లేదు.. ఆందోళన చెందకండి" అంటూ చమురు సంస్థలు మరియు డీలర్ల సంఘాలు ప్రకటనలు గుప్పిస్తున్నా, క్షేత్రస్థాయిలో సామాన్యుడి కష్టాలు మాత్రం తీరడం లేదు. అధికారుల మాటలకు, బంకుల వద్ద కనిపిస్తున్న దృశ్యాలకు పొంతన లేకపోవడంతో జహీరాబాద్ పట్టణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిల్వలు ఉంటే బంకులు ఎందుకు మూసివేస్తున్నారు? చమురు సంస్థల వద్ద సరిపడా నిల్వలు ఉన్నాయని, సరఫరా సాధారణంగానే ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే, "నిల్వలు ఉన్నప్పుడు పెట్రోల్ బంకుల వద్ద 'నిల్వ లేదు' (నో స్టాక్) బోర్డులు ఎందుకు కనిపిస్తున్నాయి?" అని వాహనదారులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. గంటల కొద్దీ నిరీక్షణ: పెట్రోల్ కోసం కిలోమీటర్ల మేర బారులు తీరాల్సి వస్తోందని, తీరా తమ వంతు వచ్చేసరికి బంకుల్లో స్టాక్ అయిపోయిందని గేట్లు మూసివేస్తున్నారని వాహనదారులు ఆవేదన చెందుతున్నారు. కృత్రిమ కొరత?: కావాలనే సరఫరాను ఆపి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా? లేక రవాణాలో లోపాలు ఉన్నాయా? అన్నది స్పష్టం కావడం లేదని జనం ఆందోళన చెందుతున్నారు. సాధారణ ఇంధనం లేదు.. ప్రీమియం పేరుతో దోపిడీ! మరోవైపు జహీరాబాద్ పట్టణంలోని కొన్ని పెట్రోల్ బంకుల యాజమాన్యాలు సామాన్యుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని అదనపు వసూళ్లకు పాల్పడుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బంకులకు వెళ్తున్న వారికి "సాధారణ పెట్రోల్ లేదు.. కేవలం అధిక ధర కలిగిన ప్రత్యేక పెట్రోల్ (పవర్/ప్రీమియం) మాత్రమే ఉంది" అని నిర్వాహకులు చెబుతున్నారు. జేబుకు చిల్లు: సాధారణ పెట్రోల్ కంటే లీటరుకు 5 నుండి 7 రూపాయల వరకు అదనపు ధర ఉండే ఈ రకం ఇంధనాన్ని సామాన్యులు తప్పనిసరి పరిస్థితుల్లో పోయించుకోవాల్సి వస్తోంది. అవగాహన లేక మోసం: అసలు రెండింటికీ ఉన్న తేడా తెలియక చాలామంది కూలీలు, రైతులు, సామాన్య ప్రజలు అడిగినంత నగదు చెల్లించి నష్టపోతున్నారు. ఇది ముమ్మాటికీ సామాన్యుడిని దోచుకోవడమేనని జనం మండిపడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ ఏది? ఇంధన కొరత లేదని ప్రకటనలు ఇవ్వడం కాదని, క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఇటువంటి అక్రమాలను ఎందుకు అరికట్టడం లేదని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జహీరాబాద్ పట్టణంలోని బంకుల్లో నిల్వ వివరాలను తనిఖీ చేసి, సామాన్యులపై అదనపు భారం పడకుండా చూడాలని పౌర సరఫరాల శాఖ అధికారులను పౌర సమాజం కోరుతోంది.