దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హత గల కుటుంబానికి సంక్షేమ పథకాలు అమలు చేయాలి: బీఆర్ఎస్

పయనించే సూర్యుడు మార్చి 26, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అర్హులైన ప్రతి ఒక్కరికీ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చింతకాని మండలంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు.బుధవారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు కలిసి ఆరు గ్యారెంటీల అమలులో జరుగుతున్న ఆలస్యంపై ఆందోళన వ్యక్తం చేశారు.మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం, చేయూత వంటి పథకాలు అర్హులైన వారికి అందడం లేదని వారు ఆరోపించారు.దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హ కుటుంబానికి సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, నిబంధనల పేరుతో లబ్ధిదారులను ఇబ్బంది పెట్టకూడదని వినతిపత్రంలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలని కూడా వారు డిమాండ్ చేశారు.ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలుకు బడ్జెట్‌లో సుమారు రూ.50,713 కోట్లు కేటాయించినప్పటికీ, వాటి అమలులో జాప్యం జరుగుతోందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చూడాలని, లేకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం నాయకులు మంకెన రమేష్, మండల కార్యదర్శి బొడ్డు వెంకట రామారావు, మండల నాయకులు వంకాయలపాటి సత్యనారాయణ, వంకాయలపాటి లచ్చయ్య, మాజీ ఎంపీపీ పొనుగంటి రత్నాకర్, కోమట్లగూడెం సర్పంచ్ పరిశుద్ధరావు, తిర్లాపురం సర్పంచ్ చాపలమడుగు వీరబాబు, చిన్నమండవ గ్రామ శాఖ అధ్యక్షులు పరసగాని ఏడుకొండలు, నర్సింహాపురం గ్రామ అధ్యక్షుడు నన్నిక నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.