దౌల్తాబాద్–రాయపోల్ బీఎల్ఏలకు స్పెషల్ రివిజన్‌పై సమగ్ర శిక్షణ

పయనించే సూర్యుడు మార్చి 26 రాజేష్) దౌల్తాబాద్ మరియు రాయపోల్ మండలాల్లో ఎన్నికల నిర్వహణను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు కీలకమైన అడుగు పడింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం సందర్భంగా బూత్ లెవల్ ఏజెంట్స్ (బీఎల్ఏలు) కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని అధికారులు విజయవంతంగా నిర్వహించారు. దొమ్మాట గ్రామంలోని రైతు వేదికలో జరిగిన ఈ శిక్షణలో దౌల్తాబాద్ ఎమ్మార్వో చంద్రశేఖర్, డిప్యూటీ తహసీల్దార్ జహీర్, ఆర్‌ఐ నాగరాజ్, అలాగే రాయపోల్ తహసీల్దార్ కృష్ణమోహన్, డిప్యూటీ తహసీల్దార్ రాజేశం, ఆర్‌ఐ రాజమల్లు, సీనియర్ అసిస్టెంట్ నాగరాజ్ పాల్గొన్నారు. బీఎల్ఏలు, సూపర్వైజర్లు ఉత్సాహంగా హాజరై శిక్షణను సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు ఓటర్ల జాబితా సవరణలు, కొత్త ఓటర్ల నమోదు, వివరాల మార్పులు, తొలగింపులు వంటి కీలక అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. అదేవిధంగా ఎలక్ట్రోరల్ మ్యాపింగ్ నిర్వహణపై స్పష్టమైన మార్గదర్శకాలు అందించారు. ఫీల్డ్ స్థాయిలో ప్రతి ఓటరు వివరాన్ని ఖచ్చితంగా నమోదు చేయడం ఎంత ముఖ్యమో వివరించిన అధికారులు, ఎన్నికల ప్రక్రియను నిష్పాక్షికంగా నిర్వహించేందుకు బీఎల్ఏలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమం చివర్లో పాల్గొన్న బీఎల్ఏలు తమ సందేహాలను అడిగి నివృత్తి చేసుకోవడం విశేషం. ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా ఎన్నికల వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *