పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 26 రిపోర్టర్ అభి పెద్దకడబూరు మండలం కూటమి ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి ఇంటి స్థలాలను పంపిణీ చేయాలని సీపీఐ మండల కార్యదర్శి వీరేష్, ఏఐకేఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఆంజనేయ డిమాండ్ చేశారు. బుధవారం పెద్దకడబూరు తహశీల్దార్ కార్యాలయం ముందు సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పేదల గృహ సమస్యను వెంటనే పరిష్కరించి, వారికి గౌరవప్రదమైన జీవనానికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంటి స్థలాల పంపిణీపై చర్యలు చేపట్టాలని, లేకపోతే సీపీఐ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.