
పయనించే సూర్యుడు మార్చి 26 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా బిజినపల్లి మండలం పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతమైంది అని వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక తెలిపారు. ఈ శిబిరాన్ని డాక్టర్ ప్రియాంక, సర్పంచ్ బోనాసి రామకృష్ణ, ఉపసర్పంచ్ గోవింద్ శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో కంటి, దంత, జనరల్ మెడిసిన్, చిన్నపిల్లల వైద్యం, ఆర్థోపెడిక్, స్త్రీ వైద్య నిపుణులు పాల్గొని మొత్తం 389 మంది రోగులకు పరీక్షలు నిర్వహించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరు రకాల స్పెషలిస్ట్ వైద్యులచే శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాతా-శిశు సంరక్షణ, కిశోర బాలికల ఆరోగ్యం, 14 సంవత్సరాల బాలికలకు హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. అలాగే మధుమేహం, క్యాన్సర్, అధిక రక్తపోటు వంటి అసంక్రమిత వ్యాధులపై స్క్రీనింగ్ నిర్వహించడంతో పాటు క్షయ, ఎయిడ్స్ వంటి అంటువ్యాధులపై పరీక్షలు చేపట్టారు. వడదెబ్బ నివారణపై కూడా ప్రజలకు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సత్యలక్ష్మి, డాక్టర్ సాయిరాం గౌడ్, డాక్టర్ నారాయణ, డాక్టర్ ప్రియా, డీపీఎంఓ వెంకటయ్య, పీహెచ్ఎన్ జక్లిన్, హెడ్నర్స్ ఎలిషా, ఆరోగ్య విస్తరణ అధికారి బాదం రాజేశ్వర్, సూపర్వైజర్ గోవింద్, సుజాత, హెల్త్ అసిస్టెంట్ గోవర్ధన్, ఏఎన్ఎంలు గజవర్ధనమ్మ, వెంకటమ్మ, సుగుణ, కృష్ణవేణి, పద్మ, యాదమ్మ, సంధ్య, కళావతి, విజయ, ఎంఎల్హెచ్పి దీప్తి, ఆశ వర్కర్లు, ల్యాబ్ టెక్నీషియన్ ఇస్లావత్ వెంకటేష్, ఆరోగ్య మిత్రులు మౌలాలి, సమీర్, బాబా, శ్రీశైలం, జగన్ తదితరులు పాల్గొన్నారు. శిబిరాన్ని సమర్థవంతంగా నిర్వహించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించినందుకు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.