చీకటిలో ‘ఒడిసిలేరు’ వీధులు: పట్టించుకోని పంచాయతీ అధికారులు

వీధి దీపాలు లేక ప్రజల ఇక్కట్లు | రోడ్లపైకి వస్తున్న పాములు.. భయాందోళనలో గ్రామస్థులు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 27 అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ సురేష్ రంగంపేట మండలం ఒడిసిలేరు గ్రామంలో వీధి దీపాలు వెలగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని ఎన్టీఆర్ బొమ్మ నుంచి సంత మార్కెట్ వరకు వెళ్లే ప్రధాన రహదారిపై స్తంభాలు ఉన్నప్పటికీ, వాటికి ఉన్న లైట్లు పనిచేయకపోవడంతో ఆ ప్రాంతమంతా చీకటిమయంగా మారింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి సమయంలో వీధి దీపాలు లేకపోవడం వల్ల దారి కనిపించక పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో రాత్రి వేళల్లో పాములు రోడ్లపైకి వస్తున్నాయని, చీకటి కారణంగా అవి కనిపించక ప్రాణాపాయ స్థితి నెలకొందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు తిరిగే ప్రదేశం కావడంతో తల్లిదండ్రులు మరింత భయపడుతున్నారు. మెయిన్ రోడ్డుతో పాటు చిన్న చిన్న వీధుల్లో కూడా లైట్లు వెలిగేలా చూడాలని, ఈ సమస్యను పంచాయతీ సెక్రటరీ వెంటనే స్పందించి పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ప్రజల భద్రత దృష్ట్యా ప్రతి స్తంభానికి లైట్లు అమర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు.