డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు కీలకం : వైరా ఏసీపీ సారంగపాణి

పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి 27,తల్లాడ రిపోర్టర్ డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు చాలా కీలకమైనదని, కంటి చూపు బాగుంటేనే వాహనాన్ని సమర్థవంతంగా నడపగలుగుతారని వైరా ఏసీపీ సారంగపాణి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా కొనసాగుతున్న అరైవ్ అలైవ్ మూడోవ విడత అవగాహన కార్యక్రమంలో భాగంగా.. వైరా ఏసీపీ పర్యవేక్షణలో తల్లాడ హైవే లో వెళ్తున్న భారీ వాహనాల డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు ఎల్ వి ప్రసాద్ ఐ హాస్పిటల్ సహకారంతో తల్లాడ పోలీస్ స్టేషన్లో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో, లారీ, ట్రాక్టర్, కారు డ్రైవర్లకు రోడ్డు భద్రతలో పాటించాల్సిన నియమాలపై సమగ్రంగా వివరించారు. ఈ శిబిరం ద్వారా 110 మందికి పైగా డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన సూచనలు ఇచ్చారు. వయస్సు పెరిగే కొద్ది కంటి చూపు మందగించడం సహజమని, క్రమం తప్పకుండా కంటి వైద్య పరీక్షలు నిర్వహించుకుని తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కంటి చూపు స్పష్టంగా ఉంటే ట్రాఫిక్ సిగ్నల్స్, రహదారి సూచనలు సరిగ్గా గుర్తించి సురక్షితంగా వాహనాలు నడపగలరని తెలిపారు. చాలా మంది డ్రైవర్లు కంటి చూపును అశ్రద్ధ చేస్తున్నారనే ఉద్దేశంతో కంటి పరీక్షలు నిర్వహించిన‌ట్లు తెలిపారు. కార్యక్రమంలో వైరా ఇన్స్పెక్టర్ వెంకటప్రసాద్, ఎస్సై వెంకటకృష్ణ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *