మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఓ ‘కూపస్థ మండూకం’

బిజెపి అజెండా 'జాతీయత'.. హిందూత్వం కాదు: ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ధ్వజం

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 27 అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ సురేష్ అనపర్తి మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి తీరుపై ప్రస్తుత ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బావిలో కప్పలాగా లోకం తెలియకుండా మాట్లాడుతున్న సూర్యనారాయణ రెడ్డికి “కూపస్థ మండూకం” అనే పదం సరిగ్గా సరిపోతుందని ఆయన ఎద్దేవా చేశారు. కొప్పవరంలో ఏర్పాటు చేసిన ఉచిత పశువైద్య శిబిరం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే, ఈ సందర్భంగా ప్రత్యర్థుల విమర్శలపై ఘాటుగా స్పందించారు.
భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలపై మాజీ ఎమ్మెల్యేకు కనీస అవగాహన లేదని నల్లమిల్లి విమర్శించారు. బిజెపి అంటే కేవలం హిందూత్వం మాత్రమేనని సూర్యనారాయణ రెడ్డి భావించడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని, ఈ దేశ ‘జాతీయతను’ కాపాడటమే తమ పార్టీ ప్రధాన అజెండా అని స్పష్టం చేశారు. తనను బిజెపిలో అప్రతిష్ఠ పాలు చేయాలన్న కుట్రతోనే మాజీ ఎమ్మెల్యే ఇటువంటి అవాస్తవ ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కుతుకులూరు గ్రామంలో ఆలయం వద్ద మట్టి నిల్వల అంశాన్ని అనవసరంగా రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్మాణం కోసం తాత్కాలికంగా నిల్వ చేసిన మట్టిని, భక్తులకు ఇబ్బంది కలుగుతుందని తెలియగానే అధికారులతో మాట్లాడి తక్షణమే తొలగింపజేశామని వివరించారు. ఈ చిన్న విషయాన్ని పట్టుకుని “ఆలయాలపై దాడులు”, “హిందూత్వంపై దాడులు” అంటూ వీడియోలు విడుదల చేయడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. “నేను అసలు బిజెపియో, నకిలీ బిజెపియో అనేది మా అధిష్ఠానం చూసుకుంటుంది.. ముందుగా మీరు వైఎస్ఆర్సీపీలో మీ పరిస్థితి ఏంటో, అక్కడ మీ స్థానం ఏంటో తెలుసుకుంటే బాగుంటుంది” అని మాజీ ఎమ్మెల్యేకు హితవు పలికారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టులు పట్టుకుని, నాలుగు గోడల మధ్య కూర్చుని ‘సోలో వీడియోలు’ చేస్తే మైలేజ్ రాదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయి సూర్యనారాయణ రెడ్డికి లేదని ఈ సందర్భంగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *