మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు

పయనించే సూర్యుడు మార్చి 27, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). రైతులు పండించిన మొక్కజొన్న, ధాన్యాన్ని మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని, వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.చింతకాని మండల కేంద్రంలో గురువారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మధిర నియోజకవర్గ కార్యదర్శి మడిపల్లి గోపాలరావుతో కలిసి నున్న నాగేశ్వరరావు మాట్లాడారు.ప్రభుత్వం వెంటనే పంట కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, ఎటువంటి షరతులు లేకుండా రైతులు పండించిన పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.మొక్కజొన్నకు ఎకరానికి 27 క్వింటాల పరిమితి విధించడం సరికాదని, ఆ నిబంధనను ఉపసంహరించుకోవాలని కోరారు. రైతుల వద్ద ఉన్న మొత్తం పంటను కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచులు, పట్టాలు, రవాణా వంటి సౌకర్యాలను ముందుగానే ఏర్పాటు చేయాలని సూచించారు. గతంలో రైతులు నెలల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు పడిన అనుభవాలను పునరావృతం కాకుండా చూడాలని పేర్కొన్నారు. లారీల కొరత లేకుండా ముందుగానే ఏర్పాట్లు చేసి, పంటను సకాలంలో తరలించాలన్నారు.ప్రభుత్వం ప్రకటించిన బోనస్‌తో సహా రైతుల ఖాతాల్లో వారం రోజుల్లోనే చెల్లింపులు జమ చేయాలని డిమాండ్ చేశారు.అనంతరం తహసీల్దార్ బాబ్జి ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో వత్సవాయి జానకిరాములు, మద్దిని బసవయ్య, రౌతు అప్పారావు, మడుపల్లి కిరణ్, గడ్డం రమణారావు, తోటకూరి వెంకటనరసయ్య, బల్లి వీరయ్య, మాదిలేని రవి, గడ్డం కోటేశ్వరరావు, దేశబోయిన ఉపేందర్, నక్కనబోయిన శాంతారావు తదితర సిపిఎం నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *