
పయనించే సూర్యుడు, మార్చ్ 27, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. జనగాం జిల్లా బచ్చన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బంది రిజిస్టర్, ఓపీ రిజిస్టర్, పిల్లల వార్డు, ఇన్ పెషేంట్ వార్డులను మందుల నిల్వలను పరిశీలించారు.
ఓపీ ద్వారా ప్రతి రోజు ఎంత మంది వైద్యం పొందుతున్నారు ఆసుపత్రిలో ఎన్ని ప్రసవాలు జరిగాయి అని వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్యను మరింతగా పెంచాలని, అందుకు తగ్గట్లుగా వైద్యాధికారులు, ఆశాలు పని చేయాలన్నారు. ఇన్ పెషేంట్ వార్డులోకి వెళ్లి రోగులతో మాట్లాడారు. ఆసుపత్రి లోపల పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని చెత్తాచెదారం, పిచ్చిమొక్కలను తొలగించాలని చెట్లను సంరక్షిస్తూ పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు.
అనంతరం మండలంలోని మన్సాన్ పల్లి, లింగంపల్లి, కొన్నె, రామచంద్రాపురం, ఇటికాలపల్లి గ్రామాల్లో జరుగుతోన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ నేపథ్యంలో వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, నాణ్యతాప్రమాణాలను తప్పకుండా పాటించాలని అధికారులకు సూచించారు.ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రతి అర్హులైన కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించడమే లక్ష్యమని వెల్లడించారు. మన్సాన్ పల్లి అంగన్వాడీ కేంద్రాన్ని, ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. కలెక్టర్ వెంట హౌసింగ్ పీడీ మాతృ నాయక్ అధికారులు తదితరులున్నారు.