
పయనించే సూర్యడు /మార్చ్ 28/ ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు కుషాయిగూడ, కాప్రా పరిసర ప్రాంతాల్లో శ్రీరామనవమి వేడుకలు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి. సీతారాముల కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని ఆయా ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో కళకళలాడాయి. భక్తులు వేకువజామునే ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. భక్తిశ్రద్ధలతో కల్యాణ వేడుకలు కుషాయిగూడలోని శివాంజనేయ స్వామి ఆలయం, కాప్రాలోని చెన్నకేశవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సహస్ర లింగేశ్వర స్వామి ఆలయం, డిఈఎ కాలనీలోని ఆంజనేయస్వామి ఆలయాల్లో స్వామివారికి అభిషేకాలు, అర్చనలు జరిగాయి. ఈ వేడుకల్లో మాజీ కార్పొరేటర్ పజ్జూరి పావని మణిపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీల ఆధ్వర్యంలో పటిష్ట ఏర్పాట్లు చేశారు. కాలనీల్లో ఆధ్యాత్మిక సందడి టిఎస్ఐఐసి కాలనీ, శివసాయినగర్, ముత్యాలమ్మ ఆలయం, నెహ్రూనగర్ తుల్జాభవాని ఆలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. జీఆర్ రెడ్డి నగర్ కాలనీలోని ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్, న్యూ శ్రీనివాస్ నగర్ కాలనీ, పద్మశాలి టౌన్ షిప్, ఆదర్శనగర్ కాలనీల్లో సీతారాముల కల్యాణ వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తీర్థప్రసాద వితరణ పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణతో పాటు పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. వేసవి తీవ్రత దృష్ట్యా భక్తులకు మజ్జిగ, తాగునీటి సౌకర్యం కల్పించారు. శ్రీరామనామ స్మరణతో కుషాయిగూడ, కాప్రా ప్రాంతాలు మారుమోగాయి.