పయనించే సూర్యుడు మార్చి 28, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు) చింతకాని మండల పరిధిలోని చిన్నమండవ గ్రామంలోని ఆర్‌సిఎం చర్చిలో ఉపవాస దీక్ష ప్రార్థనలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నాగులవంచ విచారణ గురువులు రఫెల్ ఫాదర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వత్సవాయి విచారణ గురువులు జోషి ఫాదర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా జోషి ఫాదర్ మాట్లాడుతూ, ఉపవాస ప్రార్థన అనేది దేవునితో ఆత్మీయ సంబంధాన్ని బలపరచే పవిత్ర సాధనమని పేర్కొన్నారు. ఇది కేవలం ఆహారం మానేయడం మాత్రమే కాకుండా, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ పశ్చాత్తాపంతో ప్రార్థించడం ద్వారా ఆత్మీయ బలం పొందే ప్రక్రియ అని వివరించారు. బైబిల్‌లోని యోనా ప్రవక్త కథను ఉదాహరణగా పేర్కొంటూ, దేవుని కృప, క్షమాగుణం మరియు మార్గదర్శకత్వాన్ని విశదీకరించారు.రఫెల్ ఫాదర్ మాట్లాడుతూ, దేవుని పట్ల ప్రేమ అత్యున్నత ఆధ్యాత్మిక స్థితి అని తెలిపారు. విశ్వాసంతో దేవునికి సమర్పించుకోవడం, ఆయన మాటలను పాటించడం, ఇతరులను ప్రేమించడం ద్వారా నిజమైన భక్తిని వ్యక్తపరచవచ్చని చెప్పారు. యేసు క్రీస్తు త్యాగం దేవుని అపార ప్రేమకు ప్రతీక అని పేర్కొన్నారు. నిరంతరం ప్రార్థనలు చేయడం ద్వారా కుటుంబాలకు ఆశీర్వాదాలు లభిస్తాయని తెలిపారు.అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిర్లాపురం గ్రామ సర్పంచ్ చాపలమడుగు వీరబాబు, వివిధ గ్రామాల నుండి వచ్చిన బ్రదర్స్, సిస్టర్స్, సంఘ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.