తుంగభద్రలో విషాదం.. నలుగురు మృతి

ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన టీడీపి ఇన్ ఛార్జీ రాఘవేంద్ర రెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 26 రిపోర్టర్ అభి కోసిగి మండలం కందుకూరు గ్రామ సమీపంలోని తుంగభద్ర నదిలో శుక్రవారం చోటుచేసుకున్న విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రాయచూరు జిల్లా మాన్వి తాలూకా కురిడి గ్రామానికి చెందిన పలువురు బంధువులు కందుకూరులో జరిగిన వివాహ కార్యక్రమానికి హాజరుకావడానికి వచ్చారు. వివాహ కార్యక్రమం అనంతరం శుక్రవారం మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో కందుకూరు–అగసనూరు గ్రామాల మధ్య నది వద్దకు వెళ్లి స్నానం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్నానం చేస్తుండగా లోతైన నీటిలోకి వెళ్లిన ఇద్దరు మహిళలు (సుమారు 35, 25 సంవత్సరాలు), ఇద్దరు యువకులు (18, 19 సంవత్సరాలు) ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి చేపల వలల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. కొంతసేపటి తర్వాత బాధితులను బయటకు తీసినప్పటికీ, అప్పటికే వారు మృతి చెందినట్లు గుర్తించారు. ఈ దుర్ఘటనతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, తరువాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న మంత్రాలయం టీడీపీ ఇన్చార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన వారి కుటుంబాలకు ధైర్యం చెప్పుతూ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అనుకోని ఈ ప్రమాదం కారణంగా రెండు కుటుంబాల్లో విషాదం నెలకొనగా, వివాహానికి వచ్చిన బంధువులు దుఃఖంలో మునిగిపోయారు. స్థానికులు కూడా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *