నేరెళ్లపల్లిలో కన్నులపండువగా సీతారాముల కల్యాణ మహోత్సవం

* భక్తజన సంద్రమైన హనుమాన్ దేవాలయం బారీగా తరలివచ్చిన భక్తజనం * మతసామరస్యానికి ప్రతీకగా దగ్గరుండి కళ్యాణం జరిపించిన సర్పంచ్ సమీనా జమీర్ పాషా

పయనించే సూర్యుడు – రిపోర్టర్ రేవల్లి కృష్ణ) బాలానగర్, మార్చి 28 బాలానగర్ మండల పరిధిలోని నేరెళ్లపల్లి గ్రామంలో సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామ సమీపంలోని హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో శనివారం భక్తుల కోలాహలం మధ్య ఈ వేడుకను కన్నుల పండువగా నిర్వహించారు. ఉదయం సీతమ్మ వారి విగ్రహాన్ని ఎదుర్కోలుగా ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం రామయ్య విగ్రహాన్ని ప్రతిష్టించి, అర్చకుల వేదమంత్రాల సాక్షిగా శాస్త్రోక్తంగా కల్యాణ తంతు నిర్వహించారు. మంగళవాయిద్యాల మధ్య అమ్మవారి పుస్తెల తాడును భక్తులకు చూపిస్తున్న వేళ భక్తుల రామనామ స్మరణతో ప్రాంగణం మారుమోగింది. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు రెండు కన్నులు చాలవన్నట్లుగా భక్తులు భారీగా తరలివచ్చారు. కల్యాణం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో గ్రామ సర్పంచ్ సమీనా జమీర్ పాషాతో పాటు ఉపసర్పంచ్ గంగాపురం సత్యనారాయణ, గ్రామ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కల్యాణ మహోత్సవంలో మహిళలు, చిన్నారులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసారు . గ్రామ పెద్దలందరూ ఏకతాటిపై నిలిచి సహకరించినందుకు గ్రామ యువకులు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *