పరాయి రాష్ట్ర గిరిజనేతరుడి అరాచకం

★ గిరిజన సర్పంచ్‌పై దాడి అమానుషం ★ ​కావడిగుండ్లలో అధికార పార్టీ ముసుగులో వికృత రాజకీయాలు ​★ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న సత్యంబాబు వర్గం ★ గ్రామస్తుల ఆగ్రహం

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 28 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ​అశ్వారావుపేట ప్రశాంతంగా ఉండే కావడిగుండ్ల గ్రామంలో రాజకీయ కక్షలు సెగలు పుట్టిస్తున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక గిరిజన సర్పంచ్‌పై, ఏమాత్రం సంబంధం లేని పక్క రాష్ట్రానికి చెందిన వ్యక్తి వచ్చి భౌతిక దాడికి దిగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. విధి నిర్వహణలో ఉన్న అధికారుల ముందే సర్పంచ్‌ను కులం పేరుతో దూషిస్తూ, కుర్చీతో కొట్టి కిందపడేసిన ఘటన గిరిజన పల్లెల్లో నిప్పు రాజేస్తోంది. గ్రామంలోని భూములపై రెవెన్యూ అధికారులు విచారణ జరుపుతుండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బుట్టాయిగూడెంకు చెందిన గుబ్బల సత్యంబాబు అనే ఆర్ఎంపి వైద్యుడు అక్కడికి చేరుకుని గొడవకు దిగాడు. గ్రామంతో సంబంధం లేకపోయినప్పటికీ స్థానిక కాంగ్రెస్ నాయకుల అండదండలతో అధికారుల పనికి అడ్డు తగలడమే కాకుండా గ్రామ ప్రథమ పౌరుడు బాడిశ లక్ష్మణరావుపై దుశ్చర్యకు పాల్పడ్డాడు. అడ్డువచ్చిన గ్రామ పెద్దలను సైతం చెప్పుతో కొట్టి అవమానించడం సత్యంబాబు బరితెగింపుకు నిదర్శనమని గ్రామస్తులు మండిపడుతున్నారు. ​గత పంచాయతీ ఎన్నికల్లో కావడిగుండ్ల ప్రజలు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీకి పట్టం కట్టారు. అధికార పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. అప్పటి నుండి ఈ ఓటమిని జీర్ణించుకోలేని ఒక వర్గం, ఇందిరమ్మ కమిటీల పేరుతో కండువాల ముసుగులో పంచాయతీ పాలకవర్గం చేస్తున్న ప్రతి పనిని అడ్డుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.​మాదే అధికార పార్టీ సర్పంచ్ చెప్పేది ఏముంది? అనే ధోరణితో గ్రామ కార్యదర్శిని సైతం బెదిరిస్తూ అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ​పరాయి రాష్ట్ర వ్యక్తి పెత్తనమేంటి? ​ఆంధ్రప్రదేశ్‌లో పలు నేర చరిత్ర కలిగినట్లు ప్రచారంలో ఉన్న సత్యంబాబు తెలంగాణలోని కావడిగుండ్ల రాజకీయాల్లో వేలు పెట్టడం వెనుక స్థానిక నాయకుల ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోంది. ఒక గిరిజనేతరుడు గిరిజన సర్పంచ్‌పై దాడి చేయడం కేవలం వ్యక్తిగత దాడి కాదు ఇది మొత్తం గిరిజన జాతిని అవమానించడమేనని గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ​ప్రభుత్వం స్పందించాలని గ్రామస్తుల డిమాండ్.​సర్పంచ్‌పై దాడి చేసిన గుబ్బల సత్యంబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని, ​అధికార పార్టీ ముసుగులో గ్రామంలో అశాంతిని సృష్టిస్తున్న స్థానిక నేతలపై విచారణ జరిపించాలని గ్రామ పంచాయతీ విధులకు ఆటంకం కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని,​మా సర్పంచ్ రౌడీ కాదు గ్రామ అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి అని పక్క రాష్ట్రం నుండి వచ్చి ఇక్కడ అరాచకాలు సృష్టిస్తే చూస్తూ ఊరుకోం అని కావడిగుండ్ల గ్రామ ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.