పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 28, 2026: గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ ఎమ్మిగనూరు వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీలను ఆంధ్రప్రదేశ్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ (ఆప్కో)లో విలీనం చేసే ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుకమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేనేత అంటే ఎమ్మిగనూరు, ఎమ్మిగనూరు అంటే చేనేత అనే స్థాయిలో ఈ ప్రాంతానికి గుర్తింపు తీసుకువచ్చిన పద్మశ్రీ డాక్టర్ మాచాని సోమప్ప దూరదృష్టి, కృషి ఫలితంగా ఏర్పడిన వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీలు వేలాది చేనేత కుటుంబాలకు జీవనాధారంగా నిలిచాయని ఆమె పేర్కొన్నారు. అలాంటి సొసైటీలను ఆప్కోలో విలీనం చేయడం ద్వారా చేనేతల అస్తిత్వం, స్వావలంబన, ఆస్తులు మరియు ఉపాధి ప్రమాదంలో పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. చేనేతలకు సహాయం చేయాలనుకుంటే ప్రభుత్వం ముందుకు రావాలని, అయితే సహాయం పేరుతో వారి ఆస్తులను, ఉపాధిని, స్వతంత్రతను దెబ్బతీసే ఎటువంటి చర్యలను కూడా సహించబోమని స్పష్టం చేశారు. ఎమ్మిగనూరు వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీలు ప్రస్తుతం సజావుగా కొనసాగుతున్నాయని, ఎక్కడా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు లేవని తెలిపారు. అలాంటి పరిస్థితిలో అప్పుల్లో ఉన్న ఆప్కోలో విలీనం చేయడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయని ఆమె పేర్కొన్నారు. ఎమ్మిగనూరు సొసైటీలకు అప్పులు లేకపోయినా, అప్పుల్లో ఉన్న ఆప్కోలో విలీనం చేయడం వెనుక ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నించారు. సొసైటీలలో లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్థిక సహాయం, ముడిసరుకు సబ్సిడీలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్ మద్దతు అందించడం ద్వారా సొసైటీలను బలోపేతం చేయాలని కోరారు. ఎమ్మిగనూరులో తయారయ్యే చేనేత చీరలు గద్వాల్ బ్రాండ్ పేరుతో చాలా కాలంగా మార్కెట్ అవుతున్నాయని, అయినప్పటికీ వాటి వెనుక ఉన్న శ్రమ ఎమ్మిగనూరు చేనేతలదేనని తెలిపారు. అదేవిధంగా ఎమ్మిగనూరు చేనేత బెడ్‌షీట్లు, టవల్స్ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందాయని, భారతదేశంతో పాటు విదేశాలకు కూడా ఎగుమతులు జరుగుతున్నాయని గుర్తుచేశారు. ఇలాంటి బలమైన వ్యవస్థను బలోపేతం చేయాల్సిన సమయంలో విలీనం ద్వారా బలహీనపరచడం తగదని పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల పూర్తిగా నష్టపోయేది చేనేత కుటుంబాలేనని, వారి జీవనాధారం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడా సొసైటీలు ఆప్కోలో విలీనానికి సిద్ధంగా లేనప్పటికీ, ఎమ్మిగనూరులో మాత్రమే ఈ ప్రయత్నాలు జరగడం బాధాకరమని తెలిపారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎమ్మిగనూరు చేనేతలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నామని, రాజకీయాలను పక్కనపెట్టి తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి అందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇది రాజకీయ అంశం కాదని, చేనేత కుటుంబాల భవిష్యత్తు, జీవనాధారానికి సంబంధించిన అంశమని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు సంబంధిత శాఖ మంత్రి ఉద్దేశించి, ఎమ్మిగనూరు వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీలను ఆప్కోలో విలీనం చేసే నిర్ణయాన్ని వెంటనే నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం చేనేతల అభివృద్ధి కోరుకుంటే సొసైటీలను బలోపేతం చేయడానికి అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని, విలీన చర్యలను పూర్తిగా విరమించుకోవాలని బుట్టా రేణుక స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కామార్తి నాగేషప్ప, జిల్లా చేనేత అధ్యక్షుడు ఎం.కే. శివప్రసాద్, నియోజకవర్గ చేనేత అధ్యక్షుడు మీసాలబండ నీలకంఠ, మాజీ మున్సిపల్ చైర్మన్ నజీర్ అహ్మద్, 3వ వార్డు అధ్యక్షుడు చేనేత మల్లి, అలాగే చేనేత సభ్యులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.