పయనించే సూర్యుడు 29-3-3026 గొల్లపల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు ) పట్టణంలోని సి. ప్రభాకర్ స్మారక గ్రంథాలయ భవనంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించబడింది. పట్టణంలో ఉన్న పురాతన గడి పరివాహక భూముల పరిరక్షణపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. కొన్ని వర్గాలు మున్సిపల్ ద్వారా అనుమతులు పొందినట్లు సమాచారం ఉండటంతో, ప్రజల పక్షాన అఖిలపక్ష కమిటీ ఈ అంశాన్ని గంభీరంగా పరిశీలించింది. ఈ సందర్భంగా, కోరుట్లలోని గడి బురుజు గ్రామకంఠ స్థలంగా ఉన్న సుమారు 3 ఎకరాలు 21 గుంటల భూమి అక్రమ కబ్జాకు గురవుతున్నదని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భూమిని రక్షించడం కోరుట్ల ప్రజల బాధ్యత అని స్పష్టం చేశారు. గడి బురుజుల వద్ద అఖిలపక్షాల ఆధ్వర్యంలో భారీ స్థాయిలో జన సమీకరణ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా భూముల పరిరక్షణ కోసం ఉద్యమాన్ని మరింత బలపరచాలని, అవసరమైతే చట్టబద్ధంగా కోర్టులో కేసులు వేయాలని కూడా నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి కోరుట్ల పట్టణ ప్రజలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులు, మేధావులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి చెన్న విశ్వనాథం, సిపిఎం పట్టణ కార్యదర్శి కె. శంకర్, న్యూ డెమోక్రసీ నేత చింత భూమేశ్వర్, ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు, ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పేట భాస్కర్, సమాజ్వాది పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎం.డి. ముజాహిద్, ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు ఎం.డి. రఫీ, ధర్మ సమాజ్ పార్టీ నాయకుడు బొబ్బిలి కిషోర్, తెలుగుదేశం పార్టీ కోరుట్ల నియోజకవర్గం నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాస్ బాబు, సీనియర్ నాయకుడు పోతని సత్యం, మాస్తిన్ సంఘ సభ్యుడు గుత్తుల గంగ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.