పని మాత్రం రెట్టింపు_వేతనం మాత్రం తక్కువ తప్పదు

"ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి ఆశా వర్కర్లు డిమాండ్"

పయనించే సూర్యుడు మార్చి 29 రాజేష్) దౌల్తాబాద్ మండలంలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలు గ్రామాలకు చెందిన ఆశా వర్కర్లను స్థానిక ఎస్సై జి. అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు ముందస్తుగా హౌస్ అరెస్టు చేసి అనంతరం పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగింది. తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఆశా వర్కర్లు మాట్లాడుతూ, ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా నెలకు ₹18,000 ఫిక్స్డ్ వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మండల, పట్టణ కేంద్రాల్లో గ్రామాల్లోపని చేస్తున్న ఆశా వర్కర్లపై అధిక పనిభారం పడుతోందని, తరచుగా రిపోర్టులు మళ్లీ మళ్లీ అడగడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కింది స్థాయి అధికారుల నుంచి వేధింపులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, పని భారం తగ్గించి, వేధింపులను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించిన ఆశా వర్కర్లను ముందస్తుగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని వారు తీవ్రంగా ఖండించారు. “మా హక్కుల కోసం అడిగితే అరెస్టులా? ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గం… మా పోరాటం ఆగదు, హామీలు అమలు అయ్యే వరకు సాగుతుంది” అని ఆశా వర్కర్లు ఘాటుగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు కే. బాలమణి, బి. సుకన్య, టీ. కౌసల్య, డి. రజిత, పి. భాగ్య, ఎండి షహీన్ సుల్తానా, షాహిదా, బి. రేణుక, పి. కనక లక్ష్మి, ఎన్. సౌజన్య తదితరులు పాల్గొన్నారు. ఆశా వర్కర్ల అరెస్టులతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనగా, ప్రభుత్వం తక్షణమే స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *