పయనించే సూర్యుడు మార్చి 29 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులు బిజినపల్లి మండలంలోని పాలెం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ప్లాస్టిక్ రీసైక్లింగ్ కర్మాగారాన్ని సందర్శించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ మదన్ మోహన్ తెలిపారు.నేషనల్ గ్రీన్ కార్ప్స్ తెలంగాణ మరియు కళాశాల ఈకో క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్షేత్ర పర్యటన నిర్వహించగా, పర్యావరణ పరిరక్షణ మరియు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి అధికారి దివ్య హాజరై విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై మార్గదర్శనం చేశారు.ఫీల్డ్ విజిట్‌లో భాగంగా ఫిలిక్స్ ఎకో గ్రీన్ ఎనర్జీ సంస్థకు చెందిన పారిశ్రామికవేత్త వేణు తుమ్మల ప్లాస్టిక్ రీసైక్లింగ్ అవసరం,రీసైక్లింగ్ ప్రక్రియ,దాని ప్రయోజనాల గురించి విద్యార్థులకు సమగ్రంగా వివరించారు.వ్యర్థ ప్లాస్టిక్‌ను ఎలా శుద్ధి చేసి తిరిగి ఉపయోగపడే పదార్థాలుగా మారుస్తారో ప్రదర్శనతో సహా తెలియజేశారు.ప్రిన్సిపాల్ మదన్ మోహన్ మాట్లాడుతూ, సమాజాన్ని పట్టిపీడిస్తున్న ప్లాస్టిక్ సమస్యకు పరిష్కారం చూపే దిశగా విద్యార్థుల్లో బాధ్యతాభావం పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు.దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా స్థాపించబడిన ప్లాస్టిక్ రీసైక్లింగ్ కేంద్రం పాలెంలో ఉండటం ఈ ప్రాంతానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.ఈ కేంద్రంలో వ్యర్థ ప్లాస్టిక్‌ను పూర్తిగా రీసైక్లింగ్ చేసి ఆయిల్, గ్యాస్,కార్బన్ వంటి ఉత్పత్తులుగా మారుస్తున్నట్లు తెలిపారు.ప్రతిరోజూ సుమారు 5 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా జీరో ప్లాస్టిక్ వ్యర్థ లక్ష్యాన్ని సాధించే దిశగా ఈ యూనిట్ పనిచేస్తోందని అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.