పెద్దకడబూరు మండలంలో ప్రశాంతంగా కొనసాగుతున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 28 రిపోర్టర్ అభి పెద్దకడబూరు మండలంలో నిర్వహిస్తున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అంతరాయాలు లేకుండా సజావుగా కొనసాగుతున్నాయి. విద్యార్థులు క్రమశిక్షణతో పరీక్షలకు హాజరవుతూ, అధికారులు పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా అమలవుతున్నాయి. శనివారం జరిగిన బయోలాజికల్ సైన్స్ పరీక్షకు మండలంలోని పలు పరీక్షా కేంద్రాల్లో మంచి హాజరు నమోదైంది. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం (కేజీబీవీ)లో 135 మంది విద్యార్థులకు గాను 133 మంది పరీక్షకు హాజరై, ఇద్దరు గైర్హాజరయ్యారు. అదే విధంగా ఏపీ మోడల్ స్కూల్లో 257 మందికి గాను 249 మంది హాజరై, 8 మంది గైర్హాజరయ్యారు. జిల్లా పరిషత్ (జెడ్పీ) పాఠశాలలో 254 మంది విద్యార్థులకు గాను 249 మంది పరీక్ష రాసి, ఐదుగురు గైర్హాజరైనట్లు మండల విద్యా అధికారి (ఎంఈవో) ఉస్మాన్ బాషా తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పర్యవేక్షణ కట్టుదిట్టంగా కొనసాగుతుండగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని అధికారులు వెల్లడించారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉంచడంతో పాటు, ప్రశ్నాపత్రాల పంపిణీ నుండి పరీక్షల ముగింపు వరకు అన్ని చర్యలు సక్రమంగా నిర్వహించబడ్డాయి. మండలవ్యాప్తంగా పరీక్షలు సజావుగా కొనసాగుతుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *