
పయనించే సూర్యుడు న్యూస్, మార్చి 29 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ):సమాజంలో బాధపడుతున్న వారిని ఆదుకోవడం నిజమైన సేవగా భావిస్తూ ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకులు,నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు,ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణంరాజు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.ప్రత్తిపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలో ఇటీవల కాలంలో కాలు,చేతి సమస్యలతో తీవ్ర అనారోగ్యానికి గురై బాధపడుతున్న బుదిరెడ్డి గోవింద్, బుర్రె నూకలమ్మ పరిస్థితిని తెలుసుకున్న ఆయన వెంటనే వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకుని, వారికి ధైర్యం చెప్పి మానసికంగా బలాన్ని నూరిపోశారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున మొత్తం రూ.10,000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ సహాయం ద్వారా చికిత్స ఖర్చులకు కొంత ఉపశమనం లభిస్తుందని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. మురళీకృష్ణం రాజు మాట్లాడుతూ సమాజంలో ఎవరైనా ఇబ్బందులు పడితే తాను ముందుండి సహాయం చేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. ఆర్థికంగా సామాజికంగా ఎలాంటి కష్టాలు వచ్చినా తాను అండగా ఉంటానని బాధిత కుటుంబాలకు భరోసా కల్పించారు. ప్రజలకు సేవ చేయడం ద్వారానే నిజమైన సంతృప్తి లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. గ్రామస్థులు మాట్లాడుతూ ఇలాంటి సమయంలో నాయకులు స్వయంగా వచ్చి పరామర్శించడం ఎంతో గొప్ప విషయమని మురళీకృష్ణం రాజు సేవా భావాన్ని ప్రశంసించారు.ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇతరులకు కూడా ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎంపీపీ గోళ్ళ కాంతి సుధాకర్, ఎంపిటిసి సేంద్రిపు భాస్కర్ రావు,గోనగల అజయ్, వార్డ్ సభ్యుడు తాళ్లపూడి బుజ్జి, మురా గంగబాబు,బొల్లు నాగేశ్వరావు, కోలా తాతబాబు, దాడి పుత్తయ్య తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.