పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మార్చి 29 మామిడిపెల్లి లక్ష్మణ్ జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని రామోజీపేట గ్రామంలో శనివారం హనుమాన్ దీక్ష స్వాముల శోభాయాత్ర ఘనంగా నిర్వహించబడింది. గ్రామంలోని శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో దీక్షలు చేపట్టిన స్వాములను పల్లకిలో ఊరేగింపుగా తీసుకెళ్లగా, గ్రామమంతా “జై శ్రీరామ్” నినాదాలతో మారుమోగింది. శోభాయాత్రలో భాగంగా ప్రతి వీధిలో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి, పూలమాలలు అర్పిస్తూ, కొబ్బరికాయలు కొట్టి భక్తి భావాన్ని చాటుకున్నారు. స్వాముల రాక కోసం ప్రతి ఇంటి ముందు నీటి బకెట్లు సిద్ధం చేసుకుని, వారి కాళ్లకు నీళ్లు పోసి భక్తి శ్రద్ధలతో సేవ చేశారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించారు. ఈ శోభాయాత్రలో 41 రోజుల, 21 రోజుల, 11 రోజుల హనుమాన్ దీక్షలు చేపట్టిన స్వాములు పాల్గొన్నారు. భక్తులు స్వాములకు అరటిపండ్లు, మజ్జిగ అందజేస్తూ సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో జక్కుల గుర్రు మల్లారెడ్డి, ఇద్దం తిరుపతి రెడ్డి, పల్లికొండ రవికిరణ్, రవికిరణ్, నవీన్, అనుమల్ల సత్యనారాయణ, మర్రి సురేష్, కుందురు రేవంత్, కటుకం సురేష్, రమేష్, రాజేందర్, నారాయణ, కమలాకర్, జగన్, ఎట్టెమ్ ప్రవీణ్, నాగరాజు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
