కళాశాల యాజమాన్యం వేధింపులు: విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఆలోచన

* ఫోటోల షేరింగ్.. వ్యక్తిత్వ హననం * కక్షగట్టి ఫెయిల్ చేశారని బాధితురాలు ఆవేదన * ప్రిన్సిపాల్, లెక్చరర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లి డిమాండ్

పయనించే సూర్యడు / మార్చ్ 30/ ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే ఆ విద్యార్థిని పాలిట యమపాశాలయ్యారు. అనారోగ్యంతో ఉన్నా కనీస మానవత్వం చూపకుండా, వ్యక్తిగత విషయాలను రచ్చ చేస్తూ మనసిక వేధింపులకు గురిచేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఆలోచన వరకు వెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. మొదటి నుంచీ వేధింపులే.. కాప్రాకు చెందిన తిరునాయన స్థానిక కళాశాలలో చదువుతోంది. మొదటి సంవత్సరం నుంచే కళాశాల యాజమాన్యం తనను రకరకాలుగా ఇబ్బందులకు గురిచేస్తోందని ఆమె ఆరోపించారు. తనకు అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, సక్రమంగా మెడికల్ సర్టిఫికెట్లు సమర్పించి, అటెండెన్స్ ఫీజు చెల్లించి పరీక్షలు రాస్తున్నా వేధింపులు ఆగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండో సంవత్సరంలో ఉన్న సమయంలో తన ఫోన్‌లోని వ్యక్తిగత ఫోటోలను ఇతరులకు షేర్ చేస్తూ, తన క్యారెక్టర్‌పై తప్పుడు ప్రచారం చేశారని బాధితురాలు కన్నీటిపర్యంతమయ్యారు. దీనిపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇకపై ఇబ్బంది ఉండదని ప్రిన్సిపాల్ హామీ ఇచ్చి రాజీ కుదుర్చుకున్నారు. అయితే, ఆ తర్వాత తనపై కక్షగట్టి కావాలనే కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ చేశారని ఆమె ఆరోపించారు. ఇటీవల మళ్ళీ అనారోగ్యం బారిన పడగా.. కాలేజీకి రాకుండా ఎవరితో తిరుగుతున్నావు?అంటూ ప్రిన్సిపాల్, లెక్చరర్లు అత్యంత అసభ్యకరంగా మాట్లాడారని బాధితురాలు పేర్కొన్నారు. ఈ మాటలతో తీవ్ర మనస్తాపానికి గురై, ప్రాణాలు తీసుకోవాలన్నంత పని చేశానని వాపోయారు. పోలీసుల దర్యాప్తు తమ కుమార్తె భవిష్యత్తుతో ఆడుకుంటూ, మానసిక ఒత్తిడికి గురిచేస్తున్న ప్రిన్సిపాల్, సంబంధిత లెక్చరర్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి తల్లి పోలీసులను కోరారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *