అనుభవానికి అరుదైన గౌరవం:మహబూబ్ నగర్ జిల్లా టీసీసీ అధ్యక్షులుగా కుంబర్తి రవీందర్‌కు పట్టం

★ 40 ఏళ్ల వైద్య  సేవా రంగం నుంచి సామాజిక సేవా పథం వైపు కుంబర్తి రవీందర్‌ ★ కుంబర్తి రవీందర్‌ను సన్మానించి, నియామక పత్రం అందజేసిన డీసీసీ అధ్యక్షులు ఏ. సంజీవ్ ముదిరాజ్ ★ జిల్లాలో సామాజిక చైతన్యమే లక్ష్యం_  కుంబర్తి రవీందర్‌

పయనించే సూర్యుడు మార్చి 31, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: గత నాలుగు దశాబ్దాలుగా వైద్యారోగ్య శాఖలో అలుపెరుగని సేవలు అందించిన రిటైర్డ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్  కుంబర్తి రవీందర్ కు కీలక బాధ్యతలు వరించాయి. ఆయనను తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ (టీసీసీ )మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ రాష్ట్ర కమిటీ తీసుకున్న  నిర్ణయం మేరకు ఆదివారం బషీర్‌బాగ్‌లోని తన నివాసంలో మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు  ఏ. సంజీవ్ ముదిరాజ్ రవీందర్ కు నియామక పత్రాన్ని అందజేసి  శాలువా కప్పి , పూలమాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు.వివరాల్లోకి వెళితే …రాజాపూర్ మండలం రాయపల్లి గ్రామానికి చెందిన రవీందర్.. వైద్యారోగ్య శాఖలో సీహెచ్‌ఓగా మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, రంగారెడ్డి జిల్లాల్లో విశేష సేవలు అందించారు. ఎయిడ్స్, క్యాన్సర్, మాదకద్రవ్యాల వ్యతిరేక పోరాటం, కిడ్నీ వ్యాధులపై అవగాహన వంటి ఎన్నో సామాజిక అంశాలపై నిరంతరం ర్యాలీలు, సదస్సులు నిర్వహించి గ్రామీణ ప్రజల్లో చైతన్యం నింపారు. ఇటీవలే కందుకూరు పీహెచ్‌సీలో పదవీ విరమణ చేసిన ఆయన, గత పదేళ్లుగా టీసీసీలో వివిధ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ.. రవీందర్ లాంటి అనుభవజ్ఞులు సామాజిక రంగంలోకి రావడం శుభపరిణామన్నారు. కౌన్సిల్ చేపట్టే ప్రతి సేవా కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ తరపున పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అరుదైన గౌరవాన్ని స్వీకరించిన రవీందర్ మాట్లాడుతూ తన 40 ఏళ్లుగా వైద్య రంగంలో సామాన్యులకు సేవ చేసే అవకాశం దక్కడం నా పూర్వజన్మ సుకృతం, ఇప్పుడు టీసీసీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం చాలా  గౌరవంగా ఉందన్నారు. మహబూబ్ నగర్ జిల్లా బిడ్డగా, నా సొంత జిల్లా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో చేరవేస్తూ, యువత, మహిళా సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తాననీ జిల్లాలో ప్రతి ఒక్కరినీ సమన్వయం చేసుకుంటూ టీసీసీని ముందుకు నడిపిస్తాననీ, నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన టీసీసీ రాష్ట్ర కమిటీకి, డీసీసీ అధ్యక్షులకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీసీసీ రాష్ట్రఅధ్యక్షులు డాక్టర్ మిరుదొడ్డి రాజ్ నారాయణ, ప్రముఖ సంఘ సేవకులు బ్రహ్మకుమారి సమాజ సమన్వయకర్త శివకుమార్, టీసీసీ కోఆర్డినేటర్లు జి. వేణుగోపాల్, బిచ్చుకారి సూర్య తదితరులు పాల్గొని రవీందర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.