
పయనించే సూర్యుడు మార్చి 31 డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి, రాజకీయాల్లో పెను భూకంపం! సొంత కూటమి ఎమ్మెల్యేపైనే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సౌదీ రౌఫ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి తనను 50 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశారని, ఇప్పటికే 10 లక్షలు ఇచ్చానని చెబుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పట్టణంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇక వివరాల్లోకి వెళితే ఆదోని పట్టణంలోని రిలయన్స్ ట్రెండ్స్ పక్కన ఉన్న తన స్థలానికి సంబంధించి ఎమ్మెల్యే పార్థసారథి తనను వేధిస్తున్నారని సౌదీ రౌఫ్ ఆరోపిస్తున్నారు. ప్లాన్ అప్రూవల్ ఉన్నప్పటికీ, చిన్నపాటి డివియేషన్ ఉందన్న సాకుతో ఎమ్మెల్యే వసూళ్లకు తెరలేపారని ఆయన ధ్వజమెత్తారు.ఖురాన్, భగవద్గీత, బైబిల్ సాక్షిగా తాను నిజం చెబుతున్నానని.. ఎమ్మెల్యే 50 లక్షలు అడిగితే ఇప్పటికే 10 లక్షలు ముట్టజెప్పానని సౌదీ రౌఫ్ స్పష్టం చేశారు.మిగిలిన 40 లక్షల కోసం ఎమ్మెల్యే తనను తీవ్రంగా వేధిస్తున్నారని, మున్సిపల్ అధికారులు మరియు ఇతర సిబ్బందిని తన బిల్డింగ్ వద్దకు పంపి తనను అగౌరవపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో కునిగిరి నీలకంఠం అనే వ్యక్తి మధ్యవర్తిత్వం వహించారని, ఆయనకు కూడా లక్ష రూపాయలు అదనంగా ఇచ్చినట్లు సౌదీ రౌఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పార్థసారథి తనతో మాట్లాడుతూ నీకు గుజిరి ఉంది, సిసిఐ పత్తి కొనుగోలు సెంటర్లు ఉన్నాయి.. ఎక్కడి నుండి అయినా సంపాదించి 50 లక్షలు ఇవ్వు" అని ఎమ్మెల్యే తనతో అన్నట్లు రౌఫ్ బయటపెట్టారు. సొంత కూటమికి చెందిన సీనియర్ నేతపైనే ఎమ్మెల్యే ఇలా బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడటం ఇప్పుడు కూటమి కార్యకర్తల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అవినీతి రహిత పాలన అందిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వంలో, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇలాంటి వసూళ్లకు పాల్పడటం ఇప్పుడు ఆదోని నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే పార్థసారథి తనపై వస్తున్న విమర్శలకు ఎలా సమాధానం చెబుతారో వేచి చూడాలి.