పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 31 రిపోర్టర్ అభి మంత్రాలయం వ్యవసాయ మార్కెట్ యార్డు వైస్ ఛైర్మన్ బొగ్గుల తిక్కన్న ఆధ్వర్యంలో కల్లుకుంట గ్రామంలో సోమవారం ఉచిత పశువైద్య శిబిరం ప్రారంభమైంది. ఈ శిబిరం ద్వారా స్థానిక రైతులకు, పశుపోషకులకు ఉపయోగపడే విధంగా పలు సేవలు అందించారు. వివరాల ప్రకారం, వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యదర్శి రాఘవేంద్ర, పశువైద్యాధికారి దినకర్ సూచనలతో పశువులకు అవసరమైన టీకాలు వేయడంతో పాటు మందులు పంపిణీ చేశారు. పశువుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అవసరమైన జాగ్రత్తలపై కూడా రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బొగ్గుల తిక్కన్న మాట్లాడుతూ, గతంలో నిర్లక్ష్యానికి గురైన పశుసంపద అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి శిబిరాల ద్వారా పశుసంవర్థక రంగాన్ని బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, పశుపోషకులు పెద్ద ఎత్తున పాల్గొని శిబిరాన్ని వినియోగించుకున్నారు.