
పయనించే సూర్యుడు న్యూస్ చండూరు మార్చి 31. ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చే వరకు తమ పోరాటం ఆపబోమని ఆశా వర్కర్ల సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో ఆశా వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్ల కోసం నిరసనలు ఉధృతం చేశారు. నెలకు ₹18,000 స్థిర వేతనం, ఉద్యోగ భద్రత, పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తింపు, ఆరోగ్య-ప్రమాద బీమా సౌకర్యాల కోసం వారు పోరాడుతున్నారు. చండూరు లో జరిగిన ఆందోళనలతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. చండూరు మున్సిపల్ పట్టణంలోని స్థానిక రాజీవ్ సర్కిల్ వద్ద నిరసన కార్యాక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ఆశా వర్కర్లకు రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం వెంటనే అమలు చేయాలన్నారు. ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించి, పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ఆశాల అన్ని సమస్యల పరిష్కారానికి ఎన్‌హెచ్ఎం కింద తగిన నిధులు కేటాయించాలన్నారు. ఆశా వర్కర్లపై పెరుగుతున్న పనిభారం తగ్గించి, అదనపు భత్యాలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాల ప్రయోజనాలను ఆశా వర్కర్లకు కూడా వర్తింపజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చండూరు మండల ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. గర్భిణీలు, శిశు సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న ఆశాలకు ప్రత్యేక గౌరవ వేతనం ఇవ్వాలని, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్ వంటి సదుపాయాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు .